
మట్టిమాయం చేసేందుకు...
గోపాలపురం మండలం గంగోలు పెద్దచెరువులో జేసీబీలతో మట్టి తవ్వకాలు
ఫ దందాకు తెర లేపిన టీడీపీ
ఫ వాటాలు పంచుకుంటున్న వైనం
ఫ కూటమిలో భాగస్వాములకు మొండిచేయి
గోపాలపురం: మట్టి దందాకు తెరలేపారు.. అందినకాడకు తవ్వేస్తున్నారు.. అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. గోపాలపురం మండలం గంగోలు, భీమోలు, కరిచర్లగూడెం, గోపాలపురం గ్రామాల్లోని పెద్ద చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం చెరువులో మట్టిని తరలించుకునేందుకు ప్రభుత్వానికి నామమాత్రంగా ఫీజు చెల్లించి ఆయకట్టు రైతులు తీసుకోవచ్చు. అనుమతులు వచ్చాక ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై మట్టిని తరలించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. దీనికి నీళ్లు వదిలి అసలు రైతులకు కాకుండా ఆయా గ్రామాల టీడీపీ నాయకులు మట్టిని ఇటుక బట్టీలకు లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక రైతులకు మొండిచేయి చూపి మట్టిని రాత్రనక పగలనక ఒక్కో చెరువులో రెండు జేసీబీలు, 15 లారీలతో తరలిస్తున్నారు. గంగోలు పెద్ద చెరువు నుంచి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఇటుక బట్టీలకు మట్టిని తీసుకెళ్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాల్లో నియోజకస్థాయి ప్రతినిధి వాటాగా 70 శాతం, మిగిలిన 30 శాతం స్థానిక టీడీపీ నాయకులు పంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని, 15 వేల క్యూబిక్ మీటర్లకు తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇటువైపు చూడడం లేదు. మట్టి తరలింపు లారీల రాకపోకలతో ఆయా గ్రామాల్లో రోడ్లు ఛిద్రంగా మారుతున్నాయని, లారీలో తరలించే మట్టి సుమారు 40 నుంచి 45 టన్నుల బరువు ఉండటంతో రోడ్లు గోతులు పడుతున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మరిన్ని గ్రామాల్లో మట్టిని అక్రమంగా తరలించడానికి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
తవ్వకాలపై ఫిర్యాదులకు..
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులకు టీడీపీ నాయకులు మొండిచేయి చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలోనూ వారికి వాటాలు ఇవ్వకపోవడంతో ఆయా పార్టీల నాయకులు అధిష్టానానికి తెలియజేసేలా, మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసేందుకు కార్యాచరణ చేసుకున్నట్లు సమాచారం.