నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌... | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

May 25 2025 12:09 AM | Updated on May 25 2025 12:09 AM

నిర్ల

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

డెల్టా కాలువ వ్యవస్థ

కాలువల వ్యవస్థ ఇలా...

మధ్య డెల్టాలో పంట కాలువల వ్యవస్థను పరిశీలిస్తే.. ధవళేశ్వరం హెడ్‌ స్లూయిజ్‌ నుంచి లొల్ల లాకుల వరకూ మెయిన్‌ కెనాల్‌ 13.20 కిలోమీటర్లు కాగా అక్కడి నుంచి ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్‌ 75.64 కిలోమీటర్లు ఉంటుంది. అమలాపురం కాలువ 64.210 కిలోమీటర్లు. దీని పరిధిలో బెండా కెనాల్‌ 45 కిలోమీటర్లు. పి.గన్నవరం బ్యాంకు కెనాల్‌ 72.300 కిలోమీటర్లు. మొత్తం మధ్య డెల్టాలో 225.35 కిలోమీటర్ల ప్రధాన పంట కాలువలు ఉన్నాయి. ప్రధాన పంట కాలువలు, వాటి అనుబంధంగా ఉన్న చానల్స్‌, డైరెక్ట్‌ పైప్‌ (డీపీలు), చానల్స్‌కు అనుబంధంగా ఉన్న పంట బోదెలు కలిపి మొత్తం వెయ్యి కిలోమీటర్ల నడివిడి ఉంటోందని అంచనా. అలాగే తూర్పు డెల్టాలో కొంత భాగం ఇప్పుడు కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చింది. కోటిపల్లి బ్యాంకు కెనాల్‌ పరిధి సుమారు 35 కిలోమీటర్లు. కోరంగి కాలువ 33 కిలోమీటర్లు కాగా మండపేట కాలువ 21 కిలోమీటర్లు. మొత్తం కలిసి 89 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇవి కాకుండా డీపీలు, చానల్స్‌, పంట బోదెలు కలిపి 400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని అంచనా.

అడ్డుకట్టలు.. ఎవరూ అడగరు!

సఖినేటిపల్లి లాకుల వద్ద పి.గన్నవరంలో బ్యాంకు కెనాల్‌ దుస్థితి ఇది. ప్రధాన కాలువకు ఇలా అడ్డుకట్ట వేసి వదిలేశారు. క్లోజర్‌లో ఆధునీకరణ పనుల అటుంచి కనీసం అడ్డకట్టలు తొలగించే వారే లేకపోయారు. దీని దిగువన ఉన్న రెండు చానళ్లపై సుమారు 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. లాకుల వద్ద చేరే నీటి మట్టాన్ని బట్టీ చానళ్లకు నీరు విడుదల చేస్తారు. రబీలో వంతుల వారీ విధానం, నీటి ఎద్దడి సమయంలో శివారుకు నీరందక చేలు ఎండిపోతున్నాయి.

చిట్టడవి కాదండోయ్‌..

తూడు, గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తున్నది పంట కాలువ అంటే నమ్మకం కలగదు. కానీ ఇది అంబాజీపేట మండలం పరిధి అవిడి నుంచి మాచవరం వరకూ ఉన్న చానల్‌. దీనిపై రెండు మండలాల పరిధిలో సుమారు 900 ఎకరాలు ఆయకట్టు ఉంది. గత రబీలో నీరందక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇటువంటి చోట కనీసం జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టకపోవడం గమనార్హం.

‘కాలువ’రపాట్లు

ఇది పంట బోదెను తలపిస్తోంది కదా. కానీ ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్‌ అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినవిల్లి మండలం చింతపల్లి లాకుల వద్ద లాకు చాంబర్‌కు అనుబంధంగా ఉన్న కాలువ ఇది. దీని దిగువన అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల పరిధిలో సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 5 వేల ఎకరాలు చేపల చెరువులకు, తాగునీటి ప్రాజెక్టులకు నీరందించే కాలువ ఇలా చిక్కిపోయింది.

సాక్షి, అమలాపురం: పచ్చని సిరులు పండించేందుకు జలజల పారే ధారను తీసుకెళ్లే పంట కాలువలు రూపురేఖలను కోల్పోయాయి.. పాలకుల నిర్లక్ష్యానికి నీరసించాయి.. ‘పెంట’ కాలువలను తలపిస్తున్నాయి.. డెల్టా శిల్పి సర్‌ ఆర్థర్‌ కాటన్‌ చేతి నుంచి పంట కాలువలు ఊపిరిపోసుకున్నాయి. గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేశాయి. సుమారు 140 ఏళ్లుగా లక్షలాది ఎకరాల్లో వరి, కొబ్బరి, అరటి, పోక, కంద, చేమ, కర్రపెండలం తదితర పంటలకు.. చేపలు, రొయ్యల చెరువులకు.. పదుల సంఖ్యలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రాజెక్టులకు నీరందిస్తున్నాయి.. అలాంటి డెల్టా కాలువల వ్యవస్థ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో చిక్కి శల్యమవుతున్నాయి. ఆక్రమణల బారిన పడి కనుమరుగవుతున్నాయి. తూడు, గుర్రపుడెక్కలతో పూడుకుపోతున్నాయి. ఈ కాలువల ద్వారా సహజ ప్రవాహం లేక శివారు, మెరక చేలకు రబీలోనే కాదు.. ఖరీఫ్‌లో సైతం సాగునీరందని పరిస్థితి నెలకొంది. 2009లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.1,160 కోట్లతో పంట కాలువల ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారు. ఆయన మృతితో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. లేకుంటే డెల్టా కాలువల వ్యవస్థ మరో విధంగా ఉండేది. జిల్లాలో డెల్టా పరిధిలో 2,52,742 ఎకరాల రిజిస్టర్‌ ఆయకట్టు కాగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు ఉంది. ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు జరుగుతోందని అంచనా. అంతటి కీలకమైన డెల్టాలో కాలువ వ్యవస్థ దుస్థితిపై ‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్టు’ ఇది.

నీరెళ్లే దారేది నాయనా!

రాయవరం మీదుగా మండపేట నుంచి వెళ్లే పంట కాలువ పరిస్థితి ఇది. ఈ కాలువపై సుమారు 4 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువల్లో గుర్రపు డెక్క, తూడు, చెత్తా చెదారంతో నిండిపోయింది. రబీలోనే కాాదు, ఖరీఫ్‌లో నీటి సరఫరాకు అవాంతరం ఏర్పడుతుంది. అయినా ఈ కాలువ వైపు చూసేవారు లేకపోయారు. క్లోజర్‌ పనుల్లో కనీసం తూడు, గుర్రపుడెక్క అయినా తొలగించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

‘మట్టి’... ఉంది కాబట్టి

పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పలుచోట్ల చెత్తాచెదారం పేరుకుపోయింది. సాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పి.గన్నవరం బ్యాంకు కెనాల్‌ పరిధిలో లొల్ల నుంచి సఖినేటిపల్లి వరకూ పెద్ద సంఖ్యలో ఉన్న వంతెనల వద్ద ఇలా మట్టి పేరుకుపోయింది. చెత్తతో పూడుకుపోవడంతో నీటి సరఫరాకు ఇబ్బంది ఎదురవుతోంది. పి.గన్నవరం బ్యాంకు కెనాల్‌పై వైవీ పాలెం వంతెన వద్ద మట్టి ఇలా నిలిచిపోయింది.

ఖరీఫ్‌లోనూ కష్టాలే..

అమలాపురం నుంచి చల్లపల్లి ప్రధాన పంట కాలువ ద్వారా అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల పరిధిలో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీనిపై మరో మూడు వేల ఎకరాల్లో చేపల చెరువులు ఉన్నాయి. గతంలో ఈ పంట కాలువల్లో పూడిక తొలగించారు. తిరిగి యథావిధిగా మూసుకుపోయింది. ఈ కాలువ పరిధిలో చిందాడగరువు, రోళ్లపాలెం, గూడాల, తాడికోనలకు ఖరీఫ్‌లోనే నీరందడం లేదు.

డెల్టాలో ‘పెంట’ కాలువలు

జిల్లాలో 313 కిలోమీటర్లలో

విస్తరించిన వైనం

ఎక్కడికక్కడే పూడుకుపోయి అధ్వానం

రూ.5 కోట్లు కేటాయించినా

ప్రారంభం కాని పనులు

మరో పక్షం రోజుల్లో కాలువలు

తెరిచే అవకాశం

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...1
1/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...2
2/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...3
3/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...4
4/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...5
5/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...6
6/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...7
7/7

నిర్లక్ష్యంతో నీరుసించాయ్‌...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement