
శ్రీనివాసా... శ్రీవేంకటేశా
ఫ కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం
ఫ వర్షాన్నీ లెక్క చేయకుండా తరలివచ్చిన భక్తులు
కొత్తపేట: దినదిన ప్రవర్థమానంగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పులకించింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ‘ఏడు శనివారాలు– ఏడు ప్రదక్షిణలు’ నోము ఆచరిస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరస్వామిని నూతన దంపతులు దర్శించుకుని తరించారు. దేవదాయ –ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. అనంతరం ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.48,99,380 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.