
జాతీయ స్కేటింగ్ పోటీల్లో శ్రీధర్‌కు ఆరో ర్యాంక్
అమలాపురం టౌన్: ఢిల్లీలోని జీఆర్ ఇంటర్నేషనల్ స్కూలు స్కేటింగ్ రింక్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో అమలాపురం పట్టణం సూర్యనారాయణపేటకు చెందిన కోటుం కుమార్ చందు శ్రీధర్ ప్రతిభ కనబరిచాడు. అతడు ఆరో ర్యాంక్ సాధించినట్లు కోచ్ కిల్లా రాము తెలిపారు. గత నెల 30 నుంచి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన జరుగుతున్న ఈ పోటీల్లో శ్రీధర్ అండర్–14 విభాగంలో తలపడ్డాడని వివరించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలోని స్కేటింగ్ రింక్‌లో శిక్షణ పొందిన శ్రీధర్.. గత ఏడాది కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో తన కుమారుడు విజేతగా నిలిచాడని శ్రీధర్ తండ్రి కేఎన్ మూర్తి తెలిపారు.
వెంకన్న క్షేత్రం.. ఆధ్యాత్మిక శోభితం
కొత్తపేట: వాడపల్లి క్షేత్రం శనివారం భక్తజనంతో శోభిల్లింది. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. సాధారణ భక్తులతో పాటు ఏడు వారాల నోము ఆచరిస్తున్న వారు కూడా వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతటా గోవింద నామస్మరణ మార్మోగింది. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఇతర విరాళాలు, ఆన్‌లైన్ ద్వారా సుమారు రూ.47,59,517 ఆదాయం సమకూరిందని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కళాకారులు రాత్రి ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన శ్రీ పద్మజ నృత్య కళాక్షేత్రం వారి భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. వెంటేశ్వర వైభవం తదితర నృత్య రూపకాలను ప్రదర్శించిన కళాకారిణులను చక్రధరరావు, పలువురు ప్రముఖులు అభినందించారు.

జాతీయ స్కేటింగ్ పోటీల్లో శ్రీధర్‌కు ఆరో ర్యాంక్