ఢీసీసీబీపై సోషల్‌ వార్‌ | - | Sakshi
Sakshi News home page

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌

May 3 2025 7:48 AM | Updated on May 3 2025 7:50 AM

బీసీ సామాజికవర్గం నుంచి..

ఈ సామాజికవర్గానికి దీటుగా బీసీ సామాజికవర్గం గట్టి పోటీగా నిలుస్తోంది. ఈ వర్గం నుంచి జనసేన కోసం కాకినాడ రూరల్‌ సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం తగ్గేదే లేదని గట్టి పట్టుబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భార్యాభర్తలిద్దరం జనసేన కోసం శక్తివంచన లేకుండా పని చేశామని, ఇప్పుడు సాకులు చెప్పి, చైర్మన్‌ పదవి దక్కనీయకుండా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సత్తిబాబు వర్గం పార్టీ నేతల వద్ద బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డీసీసీబీ చైర్మన్‌గిరీనీ ఒక సామాజికవర్గానికే ఎక్కడైనా రాసిచ్చేశారా? బీసీలకు ఇవ్వకూడదా? అని ఆ వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది.

సంప్రదాయమనే ముసుగేసి చైర్మన్‌గిరీకి దూరం చేద్దామనుకుంటే తాడోపేడో తేల్చుకుంటామని సవాల్‌ చేస్తోంది. చరిత్రను తిరగరాసి ఈసారి డీసీసీబీ చైర్మన్‌ పదవి తమకే ఇవ్వాలని ఆ సామాజికవర్గం పట్టుబడుతోంది. ఇలా పార్టీలోని రెండు సామాజిక వర్గాలు సై అంటే సై అంటూ కయ్యానికి దిగుతూండటం టీడీపీ అధిష్టానికి మింగుడు పడటం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం.. అనే చందంగా పరిస్థితి తయారైందని అంటున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) పీఠం కోసం కూటమిలో ‘సోషల్‌’ వార్‌ తారస్థాయికి చేరింది. ఈ చైర్మన్‌గిరీ కోసం కూటమిలోని టీడీపీ, జనసేనలు నువ్వా నేనా అనే రీతిలో తలపడుతున్నాయి. పార్టీల వారీగానే కాకుండా సామాజిక వర్గాలుగా కూడా నేతలు విడిపోయి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు ఇంతలోనే చైర్మన్‌ పీఠం జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్‌కు ఖాయమైపోయిందంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంతో కాకినాడ కేంద్రంగా ఉన్న డీసీసీబీ చైర్మన్‌గిరీ నియామకం కాస్తా రసకందాయంలో పడింది.

ఆ ముగ్గురు..

డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం టీడీపీలోని రెండు బలమైన సామాజిక వర్గాలు పోటీ పడుతున్నాయి. బ్యాంక్‌ చరిత్రను తిరగేస్తే అధికారంలో ఏ పార్టీ ఉన్నా చైర్మన్‌గిరీ తమకే దక్కుతోందని ఒక సామాజికవర్గం బలమైన వాదన వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా గతంలో చైర్మన్లుగా పని చేసిన వారి జాబితాను టీడీపీ అగ్రనేతల ముందుంచారని తెలిసింది. టీడీపీలోని ఒక సామాజికవర్గం నుంచి మెట్ల రమణబాబు, జెడ్పీ మాజీ చైర్మన్‌, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ కుమార్‌, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కటకంశెట్టి బాబీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో కోనసీమ నుంచి చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు కుమారుడు రమణబాబుకు ఇవ్వాలని ఆ ప్రాంత నేతలు చేస్తున్న డిమాండ్‌ను మెట్ట ప్రాంత నేతలు తోసిపుచ్చుతున్నారని చెబుతున్నారు. రమణబాబు ఆప్కాబ్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారంటూ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చను వారు కారణంగా చూపిస్తున్నారని అంటున్నారు. తండ్రి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా, టీటీడీ సభ్యుడిగా కూడా ఉండటంతో అదే కుటుంబం నుంచి నవీన్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన వైరి వర్గం వ్యతిరేకిస్తోంది. ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన తనకే ప్రాధాన్యం ఇవ్వాలని కటకంశెట్టి బాబీ లాబీయింగ్‌ చేస్తున్నారు. ఇలా టీడీపీలో ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు ఆశిస్తున్నారు.

సీన్‌లోకి ‘గ్లాస్‌’మేట్స్‌

డీసీసీబీ చైర్మన్‌ గిరీ కోసం టీడీపీలో రెండు బలమైన సామాజికవర్గాలు తలపడుతుండగా.. మూడో పక్షంగా జనసేన సీన్‌లోకి వచ్చింది. ఈ పదవిని ఆ పార్టీ ఎగరేసుకుపోయే ప్రయత్నాలు చివరికొచ్చేశాయని అంటున్నారు. టీడీపీలో తలపడుతున్న రెండు వర్గాలకు చెక్‌ చెప్పేందుకు మధ్యే మార్గంగా డీసీసీబీని జనసేన కోటాగా ప్రకటించేస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మధ్య ఒక అంగీకారం కూడా కుదిరిందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి డీసీసీబీని జనసేనకు ఇవ్వాలనేది కూటమి ఒప్పందంగా చెబుతున్నారు. అయితే ఇటీవల ఆ జిల్లా టీడీపీ నేతలు డీసీసీబీ కోసం గట్టిగా పట్టుబట్టారు. దీంతో, అక్కడి డీసీసీబీని టీడీపీకి జనసేన వదిలేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవిపై తాజా నిర్ణయం వెనుక పవన్‌ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు లాబీయింగ్‌ పని చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను తొక్కేసే వ్యూహంలో భాగంగా నాగబాబు.. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మర్రెడ్డి శ్రీనివాస్‌కు డీసీసీబీ చైర్మన్‌గిరీని కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. తమ నాయకుడిని పవన్‌ కల్యాణ్‌ పొగడ్తలతో ముంచెత్తుతూండగా.. ఆయన సోదరుడు నాగబాబు పరోక్షంలో తెగడుతూ, నియోజకవర్గంలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని వర్మ అనుచర వర్గం గుర్రుగా ఉంది. ఇటీవల నాగబాబు పిఠాపురంలో జరిపిన అధికారిక కార్యక్రమాల్లో వర్మ వర్గం నిరసనలతో ఈ విషయం తేటతెల్లమైందని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. మరోవైపు బంధుప్రీతితోనే మర్రెడ్డి పేరును సిఫారసు చేశారంటూ పవన్‌ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించిన జనసేన నేతలు నాగబాబుపై మండిపడుతున్నారు.

కాకినాడలోని డీసీసీబీ కార్యాలయం

చైర్మన్‌ గిరీపై

కూటమిలో కుమ్ములాటలు

జనసేన పట్టు..

తగ్గేదే లేదంటున్న టీడీపీ

పవన్‌ సోదరుడు నాగబాబు లాబీయింగ్‌

పిఠాపురం ఇన్‌చార్జి

మర్రెడ్డి వైపు మొగ్గు

బలప్రదర్శనకు సిద్ధమవుతున్న

టీడీపీ బీసీలు

పోటీలో పలువురు

మరోవైపు పొత్తులో భాగంగా కోనసీమ నుంచి కొత్తపేట సీటు త్యాగం చేసిన బండారు శ్రీనివాసరావు డీసీసీబీ పదవికి సరిపోరా అని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. కొత్తపేట నుంచి బరిలోకి దిగేందుకు అన్నీ సిద్ధ చేసుకున్న శ్రీనివాసరావు చివరి నిమిషంలో పొత్తు ధర్మం, సోదరుడు మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు కోసం కట్టుబడి పని చేస్తే కనీసం డీసీసీబీ పదవికై నా పరిశీలనలోకి తీసుకోక పోతే పార్టీపై కేడర్‌లో విశ్వాసం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాస్‌తో పాటు కాకినాడ సిటీలో ముత్తా శశిధర్‌, సంగిశెట్టి అశోక్‌, జగ్గంపేటలో తుమ్మలపల్లి రమేష్‌ వంటి నేతలు జనసేన కోసం పని చేయలేదా అని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి. వీరందరినీ కాదని కేవలం పిఠాపురంలో బంధువైన మర్రెడ్డికి ప్రొటోకాల్‌ ఇవ్వాలని, వర్మకు ముకుతాడు వేయాలనే అజెండాతోనే నాగబాబు లాబీయింగ్‌ చేస్తున్నారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. దీని ద్వారా పార్టీ శ్రేణులకు ఏరకమైన సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావడం లేదనే చర్చ వాడీ వేడిగా జరుగుతోంది. చివరకు డీసీసీబీ పీఠంపై ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాల్సిందే.

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌1
1/5

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌2
2/5

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌3
3/5

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌4
4/5

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌5
5/5

ఢీసీసీబీపై సోషల్‌ వార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement