చెక్‌ బౌన్స్‌ కేసులు ఒక ‘వింత’

Supreme Court Statement On Cheque Bounce Cases - Sakshi

చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు

కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

35 లక్షల కేసుల పెండింగ్‌ ఒక ‘వింత’ని వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైనమార్గమని సుప్రీంకోర్టు కేంద్రానికి గురువారం స్పష్టం చేసింది. ఈ దిశలో పార్లమెంటుకు అధికారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 247వ అధికరణను వినియోగించుకోవాలని కేంద్రానికి సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్‌ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్‌ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని కూడా చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, బీఆర్‌ గవాయ్, ఏఎస్‌ బోపన్న, ఎస్‌ రవీంద్రభట్‌లు ఉన్నారు. నిర్దిష్ట సమయంలో నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (ఎన్‌ఐ) యాక్ట్‌ కేసుల పరిష్కార అవసరం ఉందని స్పష్టం చేసిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్రం అభిప్రాయంతో విభేదం
ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో చెక్‌బౌన్స్‌ కేసులు సత్వర పరిష్కారం అయిపోవన్న కేంద్రం అభిప్రాయంతో ధర్మాసనం విభేదించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్‌) తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీ తన వాదనలు వినిపిస్తూ, నిందితులు కోర్టులకు హాజరుకాకపోవడం వల్లే ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు భారీగా పెండింగులో ఉంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు వల్ల తగిన ప్రయోజనం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతక్రితం ఈ కేసులో స్వతంత్ర సలహాదారుగా ఉన్న సిద్ధార్థ్‌ లుథ్రా కూడా డీఎఫ్‌ఎస్‌ వాదలను కొట్టిపారేశారు. చట్ట ప్రక్రియ సజావుగా సాగడానికి 247వ అధికరణను కేంద్రం వినియోగించుకోవచ్చని తన వాదనల్లో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ధర్మాసనం బిహార్‌లో పెండింగులో ఉన్న వందలాది బెయిల్‌ మేటర్లను కూడా ప్రస్తావించడం విశేషం. లిక్కర్‌ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ తర్వాత బిహార్‌లో ఈ తరహా  పరిస్థితి నెలకొందని బెంచ్‌ పేర్కొంది. వాదనల తర్వాత అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీ కూడా చెక్‌బౌన్స్‌ కేసులపై సుప్రీం సూచనలను స్వాగతించడం గమనార్హం. సుప్రీం అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. అయితే దీనిపై మరింత చర్చ అవసరమని పేర్కొన్నారు. ‘‘ఈ అంశంపై మేము ముందుకు వెళతాం. అయితే ప్రభుత్వం తొలుత ముందుకు రావాలని కోరుతున్నాం’’ అని బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

‘2005 నాటి కేసు విచారణ’ నేపథ్యం..
చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది.  2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్‌ బౌన్స్‌ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం)  అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లుథ్రా, అడ్వకేట్‌ కే. పరమేశ్వర్‌లు నియమితులయ్యారు.  కేసులో ఇప్పటికే కేంద్రం, హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్, డీజీపీలు, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ అయ్యాయి.  ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top