
సాక్షి,ఆదిలాబాద్: పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్ తగ్గించాలని కోరిన యువకుడిపై దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని కాల్వతండాలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... కాల్వతండాలో ఓ యువకుడి పెళ్లి బుధవారం జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా వరుడు ఇంటి ఎదుట డీజే ఏర్పాటు చేసి నృత్యాలు చేస్తున్నారు.
డీజే సౌండ్ తగ్గించాలని మెగావత్ నవీన్‌కుమార్(26) వెళ్లి వారిని కోరారు. దీంతో అక్కడి వారు నవీన్‌కుమార్‌ను చితకబాదడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు నిర్మల్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ వెకంటేశ్ గురవారం తెల్లవారుజామున తండాకు వెళ్లి ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. తండాలో అప్పటికే ఘర్షణ వాతావరణం నెలకొనడంతో మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగే వరకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
అయితే నవీన్ బీటెక్ పూర్తిచేసి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ, జానపద కళాకారుడిగా స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటుడేవాడు. అతడికి భార్య సరిత, మూడేళ్ల లోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దిలావర్‌పూర్ ఎస్సై గంగాధర్, నర్సాపూర్(జి) ఎస్సై పాకాల గీత బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.