
సాక్షి, బంజారాహిల్స్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు నిద్రాహారాలు మాని సేవలందిస్తున్న భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, రాజారం గ్రామానికి చెందిన గంగారెడ్డి క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఈ నెల 4న పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు.
ఆయనకు సేవ చేసేందుకు అతడి భార్య ఎన్.సత్యవతి కూడా నగరానికి వచ్చింది. ఈ నెల 14న ఉదయం భర్తకు అల్పాహారం తీసుకురావడానికి బంజారాహిల్స్ రోడ్ నెం. 1లో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన స్కూటర్ ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె తల పగిలి కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూసింది. మృతురాలి అల్లుడు బసవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రమాదానికి కారకుడైన సయ్యద్ ఫక్రుద్దీన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.