
భువనేశ్వరి చేతిపై గాయాలు, దుస్తులపై రక్తపు మరకలు, పొంతనలేని సమాధానాలు మరింత...
న్యూఢిల్లీ : జూన్ 3వ తేదీ గురువారం. ఢిల్లీలోని నిహాల్ ఏరియాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని ఆ ఏరియా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హత్య జరిగిన ఇంటికి వెళ్లారు. అక్కడ అనిల్ సాహు అనే వ్యక్తి చచ్చిపడిఉన్నాడు. అతడి శరీరం, ముఖం, తల,మెడపై గాయాలున్నాయి. ఏం జరిగిందని ఆమె భార్య భువనేశ్వరి దేవిని అడిగారు పోలీసులు. భర్తను కలవటానికి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన్ని చంపేసి పోయారని చెప్పిందామె. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సంఘటనా స్థలంలో వారికి ఎలాంటి ఆధారం దొరకలేదు. అయితే, హత్య జరిగినపుడు ఆ ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారెవ్వరూ సంఘటనకు సంబంధించిన ఏ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు.
దీంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దానికితోడు భువనేశ్వరి చేతిపై గాయాలు, దుస్తులపై రక్తపు మరకలు, పొంతనలేని ఆమె సమాధానాలు మరింత అనుమానం కలిగించాయి. ఆమెను గట్టిగా విచారించేసరికి నిజం ఒప్పుకుంది. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తరచుగా కొట్టేవాడని చెప్పింది. ఈ నేపథ్యంలోనే రాజ్ అనే వ్యక్తితో తను వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. భర్త ఆగడాలు మితిమీరటంతో తట్టుకోలేకపోయి, ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు వెల్లడించింది.
హత్య జరిగిన రాత్రి : ... ముందుగా వేసుకున్న పథకం ప్రకారం భర్తకు తినే అన్నంలో భువనేశ్వరి నిద్ర మాత్రలు కలిపింది. ఆ అన్నం తిన్న అతడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే ప్రియుడు రాజ్‌తో కలిసి అతడ్ని కట్టేసింది. అయితే, అనిల్‌ను చంపాలనుకుంటున్న సమయంలో అతడు పైకి లేవటంతో ప్లాన్ కొద్దిగా దెబ్బతింది. అనిల్, రాజ్‌ల మధ్య గొడవమొదలైంది. భువనేశ్వరి భర్త చేతుల్ని గట్టిగా పట్టుకోవటంతో రాజ్ అతడ్ని కొట్టి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు.