వాట్సాప్‌ గ్రూప్‌లో గంజాయి ఆర్డర్‌ 

Vanapalli Naga Sai Peddler Created WhatsApp Group To Supply Ganja - Sakshi

ప్రత్యేక గ్రూప్‌ రూపొందించిన అంతర్రాష్ట్ర పెడ్లర్‌ 

నగరంతో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న దందా

నిందితుడిని అదుపులోకి తీసుకున్న నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం 

సాక్షి, హైదరాబాద్‌: గంజాయి సరఫరాకు ఏకంగా వాట్సాప్‌ గ్రూప్‌నే క్రియేట్‌ చేశాడు వానపల్లి నాగసాయి అనే పెడ్లర్‌. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కేంద్రంగా హోల్‌సేల్‌గా ఈ గ్రూప్‌ ద్వారానే అమ్మడం మొదలుపెట్టాడు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల నుంచి ఈ గ్రూప్‌ ద్వారానే ఆర్డర్లు తీసుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం జేసీపీ ఎం.రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి వివరాలు వెల్లడించారు. 

నాగసాయి 

కేటరింగ్‌ నుంచి గంజాయి సరఫరా దాకా.. 
నర్సీపట్నం వాసి నాగసాయి కేటరింగ్‌ పని చేసేవాడు. ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, చింతూరు తదితర చోట్లకు తిరుగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొందరు గంజాయి పండించే వారితో పాటు సరఫరా చేసే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కేటరింగ్‌ వ్యాపారంలో ఆశించిన లాభాలు లేకపోవడంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న గంజాయి విక్రేతలు, సరఫరాదారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.

వీరందరి నంబర్లతో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు. ఎవరికైనా గంజాయి అవసరమైతే వాళ్లు ఇందులో ఆ వివరాలు పోస్టు చేసేవారు. వెంటనే ఏజెన్సీలోని గంజాయి రైతులను సంప్రదించి ఆర్డర్‌ ప్రకారం సరుకు సమీకరించేవాడు. అక్కడ కేజీ రూ.1,500కు ఖరీదు చేసి, ఆర్డర్‌ ఇచ్చిన వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు అమ్మేవాడు.  

తీగ లాగితే డొంక కదిలింది.. 
ఇటీవల అంబర్‌పేట పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి 2 కేజీల గంజాయి స్వా ధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం మలక్‌పేట పరిధిలో మరో ఇద్దరిని అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 300 కేజీల సరుకు సీజ్‌ చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ గంజాయిని సాయి సరఫరా చేసినట్లు తేలింది. దీంతో అతడిపై నిఘాపెట్టారు. కాగా, నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ప్రేమ్‌సింగ్‌ అనే గంజాయి వ్యాపారి.. ఇటీవల నాగసాయిని సంప్రదించాడు. తనకు 40 కేజీల గంజాయి ఆర్డర్‌ ఇచ్చాడు.

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ వరకు తీసుకొస్తే రూ.2 లక్షలు చెల్లించి తీసుకుంటానని చెప్పాడు. ఆ సరుకును వాసన రాకుండా సాయి ప్యాక్‌ చేశాడు. దీన్ని బస్తాల్లో కట్టి ప్రైవేట్‌ బస్సులో ఎంజీబీఎస్‌ వద్ద దిగాడు. అప్పటికే నిఘా ఉంచిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం వలపన్ని పట్టుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top