దొరలా వస్తాడు.. దోచుకుపోతాడు!

Thief House Breaking Cases Arrested By Visakha Police - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇంటికి తాళం వేసి ఉంటే చాలు..దొరలా వస్తాడు..దొంగతనం చేసుకుని పోతాడు. పక్కదారులు ఎన్నుకోడు..మెయిన్‌ గేట్‌ తాళాన్ని బ్రేక్‌ చేసి లోపలకు ప్రవేశించి దోచుకుపోతాడు. అలాంటి ఘరానా దొంగను శనివారం నగర క్రైం పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కేవలం ఐదు నెలల్లో ఒకే కాలనీలో 11 హౌస్‌ బ్రేకింగ్‌ దొంగతనాల్లో 25 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ.7.56 లక్షలు అపహరించిన నేరస్తుడిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం పోలీస్‌ కమిషనర్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఏడీసీపీ(క్రైం) శ్రావణ్‌కుమార్‌ మీడియాకి వెల్లడించారు.  

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో.. : గత ఏడాది అగస్టు నెల నుంచి డిసెంబర్‌ వరకు తరచూ ఎంవీపీ కాలనీలో హౌస్‌బ్రేకింగ్‌  చోరీల కేసులు నమోదయ్యాయి.  చివరిగా నవంబర్‌ నెల 29వ తేదీన మద్దిలపాలెం శివాజీపాలెంలో చోరీ జరిగినట్లు టకాసి హేమలత ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటిలో ఒక గోల్డ్‌ చైన్, 8 గోల్డ్‌ చేతి వేలి రింగులు, ఒక జత చెవి బంగారం రింగులు, 25తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.  అప్పటికే ఎంవీపీ కాలనీలో చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ద్వారకా క్రైం డివిజన్‌ సీఐ కోదాడ రామారావు నేతృత్వంలో ఎస్‌ఐ విశ్వనా«థం, ఏఎస్‌ఐ డి.కిశోర్‌ కుమార్, కానిస్టేబుళ్లు ప్రసాద్, ఎ.స్వామి, బీపీ రాజు, ఎం గణేష్‌ గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆగస్టు 14వ తేదీన కేఆర్‌ఎం కాలనీలో, సెప్టెంబర్‌ 3న, 28న మద్దిలపాలెం చైతన్యనగర్‌లో రెండు చోరీలు, నవంబర్‌ 21న మద్దిలపాలెం అచ్చివారి వీధిలో, 28న శివాజీపాలెంలో, డిసెంబర్‌ 22న మద్దిలపాలెం,  23న పెదవాల్తేర్‌ ఆదర్శనగర్, 28న శివాజీపాలెంలో చోరీ కేసులు నమోదయ్యాయి.  

అనుమానంతో ప్రశ్నిస్తే..: నగరంలో వారం రోజులుగా విజిబుల్‌ పోలీసింగ్‌ విస్తృతం చేశారు. ఇందులో భాగంగా ఎంవీపీ క్రైం పోలీసుల బృందం విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తుండగా...అనుమానంతో మధురవాడ కొమ్మాది అమరావతి కాలనీకి చెందిన మారాడ సాయి అలియాస్‌ సోరపిట్టలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత ఐదునెలల్లో హౌస్‌ బ్రేకింగ్‌ దొంగతనాలన్నీ ఒకే విధంగా జరగడంతో అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. మొత్తం 11 చోరీలు తనే చేసినట్లు మారాడ సాయి అంగీకరించాడు. 

అంతేకాకుండా గతంలో ఏడు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి ..కరోనా సెకండ్‌ వేవ్‌లో బయటకు వచ్చినట్లు తెలిపాడు. అప్పటినుంచి మళ్లీ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించడంతో అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించినట్టు  ఏడీసీపీ క్రైం శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. నిందితుడు 11 కేసుల్లో రూ7.56లక్షల సొత్తు (25 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.1,01,000 నగదు) చోరీ చేసినట్లు అంగీకరించా డు. అతడి నుంచి రూ. 6లక్షల విలువైన (ఇరవై మూడున్నర తులాల బంగారం, 30 తులాల వెండి) స్వాధీనం చేసుకున్నట్టు ఏడీసీపీ తెలిపారు. ఇలావుండగా  గతంలో నగరంలో గోపాలపట్నం, ఎయిర్‌పోర్ట్, ఎంవీపీ, త్రీటౌన్‌ పోలీసుస్టేషన్లలో మరో ఏడుకేసులు నమోదయ్యాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top