సైదాబాద్‌ అత్యాచార కేసు: ఆచూకీ చెప్తే రూ. 10 లక్షలు

Saidabad rape case: Police Announce Rs 10 Lakh Reward For Info On Accused - Sakshi

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు నిందితుడిపై పోలీసుల రివార్డ్‌

ప్రకటించిన హైదరాబాద్‌ సీపీ.. నిందితుడి ఆనవాళ్లు విడుదల

సమన్వయంతో పనిచేస్తున్న మూడు కమిషనరేట్లు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం ప్రకటించారు. నిందితుడి ఫొటో, ఆనవాళ్లను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలియజేయాలనుకొనేవారు ఈస్ట్‌జోన్‌ డీసీపీకి 9490616366 లేదా టాస్క్‌ఫోర్స్‌ డీసీపీకి 9490616627 ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ కేసు దర్యాప్తు తీరుతెన్నులపై అంజనీకుమార్‌ మంగళవారం సమీక్షించారు. నిందితుడిపై రివార్డు ప్రకటన నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులూ రంగంలోకి దిగారు. మొత్తం పది బృందాలు క్షేత్రస్థాయిలో గాలిస్తుండగా మూడు కమిషనరేట్లకు చెందిన ఐటీ సెల్స్‌ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. రాజు సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో ఆచూకీ కనిపెట్టడం జటిలంగా మారిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు అతడి ఫొటోతోపాటు వివరాలనూ పంపినట్లు ఆయన తెలిపారు. రాజు మద్యం మత్తులో వైన్‌ షాపులు, ఫుట్‌పాత్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లోనే తలదాచుకుంటూ ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఈ దారుణం అనంతరం రాజు పారిపోవడానికి అతని స్నేహితుడు సహకరించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుగా పోలీసులు చెబుతున్నారు. వ్యసనాలు, చిల్లర దొంగతనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతున్న రాజుకు అతని కుటుంబం దూరంగా ఉంటోంది. భార్య కూడా అతన్ని వదిలేసింది. అందుకే అతని కుటుంబీకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. 

ఇవీ రాజు ఆనవాళ్లు... 
30 ఏళ్ల వయస్సు, ముఖానికి గడ్డం 
దాదాపు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు 
రబ్బర్‌ బ్యాండ్‌తో బిగించి ఉండే పొడువాటి జుట్టు 
తలపై టోపీ, మెడలో ఎర్రటి స్కార్ఫ్‌ 
రెండు చేతుల మీదా మౌనిక అనే పేరు పచ్చబొట్టు   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top