స్టేట్‌లేవల్‌ హాకీ ప్లేయర్‌.. ఏకంగా ఉపాధ్యాయుడిపైనే..

Rajasthan: Student Opens Fire On Teacher After Being Removed From School - Sakshi

జైపూర్‌: విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడానికి టీచర్లు మందలిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఉపాధ్యాయులు ఏది చేసిన.. అది విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు కోసమే. అయితే, ఇక్కడో టీచర్‌.. తన స్టూడెంట్‌  ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రబుధ్దుడు కోపంతో.. ఏకంగా తన గురువుపైనే కాల్పులకు తెగబడ్డాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జైపూర్‌ జిల్లాలో ఉన్న పాఠశాలలో జరిగింది. నట్వర్‌ సింగ్‌ యాదవ్‌ అనే ఉపాధ్యాయుడు స్థానిక కోట్‌పుత్లిలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. కాగా, అదే పాఠశాలలో మోతిలాల్‌ అనే విద్యార్థి పన్నెండవ తరగతి అభ్యసించేవాడు.

ఈ క్రమంలో ఉపాధ్యాయుడు నట్వర్‌ సింగ్‌ యాదవ్.. తరగతి గదిలో మోతిలాల్‌ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించాడు. దీన్ని మోతిలాల్‌.. అవమానకరంగా భావించాడు. కోపంతో టీచర్‌ను పట్టుకోని నానా దుర్భాషాలాడాడు. అంతటిలో ఆగకుండా.. టీచర్‌ అని విషయం మరిచిపోయి చేయి చేసుకున్నాడు. ఈ ఘటన పాఠశాలలో కలకలం రేపింది. దీంతో ఈ విషయం కాస్త పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వరకు వెళ్లింది. ఈ క్రమంలో మోతిలాల్‌ను టీసీ(ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌) ఇచ్చి పంపించి వేయడానికి పాఠశాలలో నిర్ణయించారు. దీంతో మోతిలాల్‌.. తన ఉపాధ్యాయుడిపై కోపంతో రగిలిపోయాడు. అదును కోసం ఎదురు చూడసాగాడు. దీంతో నిన్న (గురువారం) .. యాదవ్‌ పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో.. మోతిలాల్‌ తన మిత్రులతో కలిసి తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఈ సంఘటనతో యాదవ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, కాల్పులు జరపడం వలన యాదవ్‌ కాలికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతో అతను రక్తపు మడుగులో కిందపడి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని... యాదవ్‌ను జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యాదవ్‌కు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే, నిందితుడు మోతిలాల్‌ స్టేట్‌ లెవల్‌ హకీ క్రీడాకారుడని , తాజాగా రాజస్థాన్‌ గవర్నర్‌చే సన్మానించ బడ్డాడని స్థానికులు తెలిపారు. కాగా, నిందితులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జైపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top