Warangal Corporator Case: సవాల్‌గా కార్పొరేటర్‌ భర్త కేసు

Police Investigating On Warangal Corporator Husband Case - Sakshi

పోలీసులకు సవాల్‌గా కార్పొరేటర్‌ భర్త కేసు

డబ్బులు తీసుకొని శారీరకంగా వంచించాడని యువతి ఫిర్యాదు

సీపీ తరుణ్‌ జోషి ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు

మగువ, మందుతో ఖాకీలకు వలవేశారన్న అంశాలపై లోతుగా విచారణ

సాక్షి, వరంగల్‌ : ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వంచించడమే కాకుండా భూమిపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ రూ.90 లక్షలు వసూలు చేసిన వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సీపీ తరుణ్‌ జోషి ఆదేశాల మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు మూడు రోజుల కిందట కేసు నమోదు చేసినా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. దీంతోపాటు పోలీసులపై పలు ఆరోపణలు వస్తుండడంతో సీపీ అలర్ట్‌ అయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా ఈ కేసులో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు

పెద్దోళ్లకు దగ్గరనే ఆలస్యమా..
మూడు దశాబ్దాలుగా గ్రేటర్‌ వరంగల్‌లో లిక్కర్‌ డాన్‌గా ముద్రపడిన కార్పొరేటర్‌ భర్త తండ్రి తన వ్యాపార విస్తరణకు ఎందరో ముఖ్య నేతలకు దగ్గరయ్యాడు. బిజినెస్‌ సాఫీగా సాగేందుకు కొందరు పోలీసులతో సన్నిహితంగా ఉండడమే కాదు.. వారికి మగువ, మద్యం చూపి లోబరుచుకొని పనులు చేయించుకునేవాడని వార్తలు సామాజిక మాధ్యమాలతోపాటు టీవీ చానళ్లలో ప్రసారం కావడం పోలీస్‌ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఏకంగా కొందరు ఖాకీలను శ్రీలంక, మలేసియాకు తీసుకెళ్లి విందు వినోదాలు ఇచ్చాడని వచ్చిన వదంతులను తీవ్రంగా పరిగణించిన సీపీ ఈ మేరకు విచారణ చేపట్టి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్‌ పార్క్‌ ‘తెలంగాణలో..’

మరోవైపు సాధ్యమైనంత తొందరగా ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని హుకుం జారీచేసినట్టు తెలిసింది. ఈ కార్పొరేటర్‌ భర్త, అతడి తండ్రి ఓ ముఖ్య నేత వ్యాపారంలో భాగస్వామి కావడంతో ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సదరు నేత సీరియస్‌ అవడంతోనే మిల్స్‌ కాలనీ సీఐ శ్రీనివాస్‌ ఒక రోజు మొత్తం సెలవుపై వెళ్లాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత విధులకు వచ్చారు. దీనిపై ఏసీపీ గిరికుమార్‌ను ఫోన్‌లో సంప్రదిస్తే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వీరిని అరెస్టు చేశామని వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. కార్పొరేటర్‌ భర్త పై మోసం, అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఇతడికి సహకరించిన తండ్రిపై కూడా బెదిరింపుల కేసు పెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top