గొంతు నులిమి.. ఆపై ఇటుకతో మోదాడు

Man Trying To Assasinate Wife In Vizianagaram - Sakshi

తప్పుచేస్తున్న భార్యపై మండిపడ్డాడు. చేతిలో ఉన్న తువ్వాలతో పీక నులిమాడు. ఆపై ఇటుక రాయితో తలపై మోదాడు. తల నుంచి తీవ్రంగా రక్తం కారడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తన భార్య మృతిచెందిందనుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లాడు. అక్కడ ఆమె లేదు. ఏమైందోనన్న కంగారుపడిన పోలీసులకు ఆమె కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతుందన్నట్లు తెలుసుకుని, ఊపిరిపీల్చుకున్నారు. 

విజయనగరం క్రైమ్‌:  నగరంలోని గాజులరేగకు చెందిన వంకర ఏసు, భార్య రాముతో కలిసి బొండపల్లి అత్తవారింటికి వెళ్లి శుక్రవారం తిరిగి ఇంటికి బయలుదేరారు. జేఎన్‌టీయూ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి అక్కడున్న గోదాము వద్ద ఎవరూ లేకపోవడాన్ని ఏసు గమనించాడు. తన చేతిలో ఉన్న తువ్వాలతో భార్య గొంతు నులిమి, అనంతరం ఇటుకరాయితో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తల నుంచి తీవ్రంగా రక్తం కారి స్పృహతప్పి పడిపోయింది.  తన భార్య చనిపోయిందనుకుని ఏసు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొంతసేపటికి తేరుకున్న ఆమె గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో కూలిపనులు చేసుకుంటున్న కార్మికులు ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ విషయం టూటౌన్‌ పోలీసులకు తెలియదు.

ఏసుతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు అక్కడ తువ్వాలు తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో కంగారుపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకుని కేంద్రాస్పత్రికి పరుగులు తీశారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలు రామును చూసి ఊపిరిపీల్చుకున్నారు. ఆమె  వద్ద నుంచి వివరాలు సేకరించారు. కాగా కొంతకాలంగా తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని,  శుక్రవారం గోదాము వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని, దీంతో కోపంతో ఆమెను కొట్టానని ఏసు పోలీసులకు చెప్పాడు. సంఘటన స్థలం వన్‌టౌన్‌ పరిధికావడంతో  సీఐ జి.మురళి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top