సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా

IAS officer arrested in Kolkata fake vaccine scam  - Sakshi

ఐఏఎస్‌ అధికారినంటూ జనానికి బురిడీ 

ఉత్తుత్తి వ్యాక్సినేషన్‌ కేంద్రాలతో దేవాంజన్‌ దేవ్‌ హడావుడి

ఎంపీ, సినీనటి మిమి చక్రవర్తి ఫిర్యాదుతో కదిలిన డొంక

ఊచలు లెక్కిస్తున్న మోసగాడు

కోల్‌కతా: ఒంటిపై మడత నలగని సూటు, బూటు. ఐఏఎస్‌ అధికారిగా దర్పం. నీలి బుగ్గకారులో ప్రయాణం. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు. ప్రజా సేవకుడిగా ఫోజులు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కీలక అధికారినంటూ జనాన్ని మభ్యపెట్టడం. ప్రజల్లో ‘గుర్తింపు’కోసం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఓ మోసగాడు సాగించిన లీలలు ఇవీ. సొంత డబ్బులతో ఉత్తుత్తి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు నిర్వహించి, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడంటూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సదరు మాయగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.  

పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా ప్రాంతానికి చెందిన దేవాంజన్‌ దేవ్‌ వయసు కేవలం 28 సంవత్సరాలు. అయితేనేం మోసాల్లో ఆరితేరిపోయాడు. అతడి తండ్రి మనోరంజన్‌ దేవ్‌ బెంగాల్‌ ఎక్సైజ్‌ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. దేవాంజన్‌ చారుచంద్ర కాలేజీలో జువాలజీ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. కలకత్తా యూనివర్సిటీలో జెనటిక్స్‌లో పీజీ చదవడానికి ప్రవేశం పొందాడు.

కానీ, చదువు మధ్యలోనే అటకెక్కింది. 2014లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాశాడు. ప్రిలిమినరీ పరీక్షలోనే విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ పరీక్షల్లో నెగ్గానని తన తల్లిదండ్రులను నమ్మించాడు. ఐఏఎస్‌ అధికారిగా ట్రైనింగ్‌ కోసం ముస్సోరి వెళ్తున్నానని చెప్పాడు. కానీ, ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో చేరాడు. ఆ సమయంలో కొన్ని పాటల ఆల్బమ్‌లు రూపొందించాడు.

2017లో ఇంటికి తిరిగివచ్చాడు. ట్రైనింగ్‌ పూర్తయ్యిందని చెప్పాడు. రాష్ట్ర సచివాలయంలో తనకు ఉద్యోగం వచ్చిందని బుకాయించాడు. అప్పటి నుంచి మోసాలే వృత్తిగా జీవనం సాగించాడు. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారినంటూ నకిలీ లెటర్‌హెడ్లు, గుర్తింపు కార్డులు సృష్టించాడు. కార్పొరేషన్‌ ఈ–మెయిళ్లను పోలిన ఈ–మెయిళ్లు సైతం రూపొందించుకున్నాడు. పోర్జరీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఆఫీసు ప్రారంభించాడు. తాను పెద్ద అధికారినని, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ జనానికి చెప్పేవాడు. దీంతో ఇరుగు పొరుగు, బంధుమిత్రులు గొప్పగా చూడసాగారు. దేవాంజన్‌కు అమితమైన గౌరవం ఇచ్చారు.  

మోసాన్ని పసిగట్టిన మిమీ చక్రవర్తి  
2020లో కరోనా వైరస్‌ వ్యాప్తిని దేవాంజన్‌ దేవ్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు సేకరించి, ప్రముఖుల చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశాడు. ఈ ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో అతడికి మరింత ప్రచారం లభించింది. దేవాంజన్‌ ఇటీవల సొంత డబ్బులతో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు నిర్వహించాడు.

వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం సాగించాడు. ఓ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, సినీ నటి మిమీ చక్రవర్తిని ఆహ్వానించాడు. ఆమె నకిలీ టీకా తీసుకొని మోసపోయింది. అనారోగ్యానికి గురైంది కూడా. దాంతో  ఆమెకు అనుమానం వచ్చింది. కోల్‌కతా మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు రంగంలోకి దిగారు. దేవాంజన్‌ గుట్టును రట్టు చేశారు. అతడు నిర్వహించే వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అసలైన కరోనా టీకాలకు బదులు అమికాసిన్‌ అనే యాంటీబయాటిక్‌ ఇస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 2,000 మందికి ఈ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తేల్చారు. పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు పెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top