మత్తు అలవాటు పడితే.. భవిష్యత్తు చిత్తు

Hyderabad :Youth Addicted To Drugs Rude Behaviour With Locals In Kukatpally - Sakshi

సాక్షి, ఆల్విన్‌కాలనీ( హైదరాబాద్‌): మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలుగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ముఠాలుగా ఏర్పడి జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలను పీలుస్తున్నారు. యువతే ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈ చీకటి వ్యవహారాన్ని నిర్వహిస్తుండటంతో యువత రోగాల బారిన పడుతుండటంతో పాటు చెడుదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

►  కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, ఫ్లై ఓవర్లు, చెరువు కట్టలు, నిర్మానుష ప్రదేశాలు ఎంచుకొని యువత మాదకద్రవ్యాలు సేవిస్తూ అటుగా వెళ్లే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుండటం గమనార్హం. అదేమిటని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటావో చేసుకో మేము స్థానికులమంటూ దుర్భాషలాడుతున్నా­రని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూకట్‌పల్లి నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే చిత్తారమ్మ ఆలయ రోడ్డులో ఓ దుకాణం సమీపంలో యువత మాదకద్రవ్యాలను సిగరెట్లో నింపుకొని సేవిస్తూ చిందులేస్తూ రహదారిపై వెళ్లేవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని మందలించగా ఎదురుదాడికి దిగారని స్థానికులు, ప్రయాణికులు వాపోయారు.  
►  కూకట్‌పల్లి సర్కిల్‌ ధరణినగర్‌ సమీపంలో పరికి చెరువు కట్టపై నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్తుపదార్థాలు సేవించటమే కాకుండా మందుబాబులకు కూడా అడ్డాగా మారింది. స్థానికులు వారిని ప్రశ్నిస్తే మత్తులో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని రాత్రి వేళల్లో అరుపులు, కేకలతో అలజడి సృష్టిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు.  
►  ఎల్లమ్మబండ చౌరస్తాలో, ఎన్‌టీఆర్‌నగర్, రైతు బజార్, మహదేవ్‌పురం చౌరస్తాలోని సిక్కుల కాలనీల్లో గంజాయి వ్యాపారం విరివిగా జరుగుతుందని యువతను టార్గెట్‌ చేసి గంజాయిని విక్ర­యిస్తూ యువతను చెడు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.  
►  భరత్‌నగర్‌ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో సైతం యువత గంజాయి మాదకద్రవ్యాలను సేవిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు గమనించి అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. మత్తులో ఉన్నవారు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో అని ఆందోళన చెందుతున్నారు.  
►  జగద్గిరిగుట్ట, ఆస్‌బెస్టాస్‌ కాలనీ, హుడా పార్కు ప్రాంతాలను ఆసరాగా తీసుకొని రాత్రి వేళల్లో యువత గంజాయి సేవిస్తూ ఆ ప్రాంతవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  
►  కేపీహెచ్‌బీ కాలనీ కళామందిర్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పద్మావతి ప్లాజా ప్రాంతం, జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని యువత జోరుగా మత్తుమందులు సేవిస్తున్నారు.  
►  ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ పెంచి మాదక ద్రవ్యాలు సేవించే వారిపై దృష్టి సారించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేస్తే తప్ప వారిలో మార్పు రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి
కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సేవిస్తూ యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు.  పరికి చెరువు కట్టపై రోజూ యువత గుంపులుగా వచ్చి సిగరెట్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన మందును నింపుకొని పీలుస్తూ దాడులకు దిగుతున్నారు. పోలీసు వారు పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో వారికి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. వారు వెళ్లిపోగానే తిరిగి గంజాయి పీలుస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. 
– గోపాల్, ధరణినగర్‌ జనరల్‌ సెక్రటరీ 

కఠిన చర్యలు తథ్యం
నిర్జన ప్రాంతాల్లో యువత గంజాయి తాగుతూ పెడదారిన పడుతున్నారని తమకు ఫిర్యాదు రావటంతో వెంటనే  స్పందించి వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశాము. ఇటీవల మూసాపేటలో గంజాయి విక్రయిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఎక్కడి నుంచైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిఘా ఏర్పాటు చేస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. 
 – నర్సింగరావు, ఇన్‌స్పెక్టర్, కూకట్‌పల్లి 

 ( చదవండి: టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు.. )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top