నేపాలీ గ్యాంగ్‌: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! 

CP Anjani Kumar Announces Nepali Robbery Gang Arrested In Hyderabad - Sakshi

వ్యవస్థీకృతంగా నేరాలు చేస్తున్న నేపాలీలు 

2018లో అబిడ్స్‌లో రూ.1.19 కోట్ల సొత్తు చోరీ 

ఇటీవల మలక్‌పేటలో రూ.11.5 లక్షల నగదు 

నలుగురి అరెస్టు, పరారీలో మరో నలుగురు 

సాక్షి, సిటీబ్యూరో: బతుకుదెరువు కోసమంటూ నేపాల్‌ నుంచి వచ్చి యజమానుల దగ్గర నమ్మకంగా పనిచేసే నేపాలీ గ్యాంగ్‌ అదును చూసుకుని అందినకాడికి దోచేస్తోంది. ఆపై దేశం దాటేసి స్వదేశానికి వెళ్లిపోతోంది. మారు పేర్లతో మళ్లీ నగరంలో అడుగుపెట్టి తమ పంథా కొనసాగిస్తోంది. మూడేళ్ల కాలంలో దాదాపు రూ.1.2 కోట్ల సొత్తు, నగదు తస్కరించిన ముఠాలకు నేతృత్వం వహించిన కమల్‌ సాహిని ఈస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఉమ్మడిగా అరెస్టు చేశారు. సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్, డీసీపీ చక్రవర్తి గుమ్మిలతో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ పూర్తి వివరాలు వెల్లడించారు.  

నేపాల్‌లోని భేరీ రాష్ట్రం సుర్ఖేత్‌ జిల్లాకు చెందిన ట్రావెల్స్‌ వ్యాపారి కమల్‌ సాహి కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. అబిడ్స్‌లోని ఎఫ్‌ఎస్‌ లైన్‌కు చెందిన సునీల్‌ అగర్వాల్‌ వద్ద వాచ్‌మెన్‌గా చేరాడు. 
యజమాని దగ్గర నమ్మకం సంపాదించిన ఇతగాడు 2018లో తాను అనివార్య కారణాల నేపథ్యంలో స్వస్థలానికి వెళ్తున్నానని చెప్పాడు. తమ ప్రాంతానికే చెందిన వికాస్, మాయలు మీ దగ్గర పని చేస్తారంటూ వారిని చేర్చాడు. 
కమల్‌ సైతం గుట్టుచప్పుడు కాకుండా సిటీలోనే ఉన్నాడు. 2018 దీపావళి రోజు సునీల్‌ అగర్వాల్‌ తన కుటుంబంతో సహా ఓ కార్యక్రమానికి వెళ్లారు. అదే అదునుగా భావించిన కమల్‌ రంగంలోకి దిగాడు. 
 వికాస్, మాయలతో కలిసి సునీల్‌ ఇంటి తాళాలు పగులకొట్టి లోపలకు ప్రవేశించారు. అక్కడ ఉన్న సొత్తు, నగదు, డాలర్లతో కలిపి రూ.1.19 కోట్ల సొత్తు చోరీ చేశారు. దాన్ని తీసుకున్న ఈ త్రయం నేపాల్‌కు పారిపోయి పంచుకున్నారు. 
గత ఏడాది మళ్లీ సిటీకి వచ్చిన కమల్‌ సాహి తనతో పాటు మనోజ్, చందులను తీసుకువచ్చాడు. తన ఉనికి బయటపడకుండా వీరిని ముసరాంబాగ్‌కు చెందిన విజయ్‌ కుమార్‌ ఇంట్లో పనికి చేర్చాడు.  

చదవండి: చైనాకు  వెంట్రుకల స్మగ్లింగ్‌!

వీరిద్దరి ద్వారా సబీనా అనే మహిళనూ వంట మనిషిగా పనిలో పెట్టాడు. ఆపై నేపాల్‌కే చెందిన అశోక్, రేఖలు విజయ్‌ వద్ద చేరారు. ఈ నెల 12న అదను చూసుకుని ఇంట్లో ఉన్న ముగ్గురు నేపాలీలు రూ.11.5 లక్షలతో ఉడాయించారు. 
ఈ మేరకు మలక్‌పేట ఠాణాలో కేసు నమోదు కావడంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు నేతృత్వంలో ఎస్సైలు గోవింద్‌ స్వామి, పి.వాసుదేవ్, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్‌ రంగంలోకి దిగారు. 
 మలక్‌పేట ఏఐ నాను నాయక్‌ సహకారంతో 12 ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. పూణే, గుజరాత్, ముంబై, బెంగళూరుల్లో గాలించారు. నేపాల్‌ పారిపోయే సన్నాహాల్లో ఉన్న కమల్, బిశాల్, ప్రకాష్, మనోజ్‌లను అరెస్టు చేశారు. 
 రెండు నేరాల్లో పాల్గొన్న నిందితులకు సహకరించిన వారిలో భూపిన్, అశోక్, రేఖ, చందు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.4 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top