‘పెళ్లయ్యాక చావైనా, బతుకైనా అత్తింట్లోనే’

పెళ్లైన 2నెలలకే వివాహిత ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: మండలంలోని నవాబుకోటకు చెందిన అనూష (19) మంగళవారం అత్తింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సుబ్బారెడ్డి కథనం...అనంతపురం జిల్లా తనకల్లు మండలం పాలెంవారిపల్లెకు చెందిన నెమలిపాళ్యం వెంకట్రమణ కుమార్తె అనూషకు మండలంలోని నవాబుకోటకు చెందిన నీరుగట్టి నరసింహులు కుమారుడు సుబ్రమణ్యంతో రెండు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లి అంటేనే తనకు ఇష్టం లేదని, పుట్టింటికి వచ్చేస్తానని సోమవారం రాత్రి ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పింది.
పెళ్లి అయ్యాకా చావైనా, బతుకైనా అత్తింట్లోనే ఉండాలని వారు సూచించారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందింది. తహశీల్దార్ కళావతి, వీఆర్వో నరసింహులు సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు.