Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి!

Chain Snatcher Umesh Khatik Gives Twist In Police Investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో అయిదు స్నాచింగ్స్‌ సహా ఎనిమిది నేరాలు చేసిన సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతిక్‌ వ్యవహారంలో గుజరాత్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. అతగాడు ఇక్కడ స్నాచ్‌ చేసిన 18.5 తులాల బంగారాన్నీ వాళ్లు ‘కాజేశారు’. దాన్ని తమ వద్ద జరిగిన నేరాల్లో రికవరీ చూపించిన అధికారులు ఇక్కడ ఒక స్నాచింగ్‌లో తెంచిన గొలుసు మరో నేరం చేస్తున్నప్పుడు రోడ్డుపై పడిపోయినట్లు రికార్డుల్లో పొందుపరిచారు.

ఉమేష్‌ నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విధంగానే రికార్డు చేశారు. దీన్ని చూసిన తెలంగాణ పోలీసుల అధికారులు కంగుతిన్నారు. మరోపక్క ఉమేష్‌ను ఇక్కడకు తరలించడానికి అనుమతి కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు స్థానిక కోర్టుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు.  

రికవరీలు కష్టం కావడంతో.. 
చాలా కాలం క్రితం తమ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తు ఇప్పుడు రికవరీ కావడం కష్టం కావడంతో గుజరాత్‌ పోలీసులు అతి తెలివితో వ్యవహరించారు. ఉమేష్‌ ఈ నెల 19న హైదరాబాద్‌ చేరుకున్నాడు. అదే రోజు ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు.

దానిపై సంచరిస్తూ 20న పేట్‌ బషీరాబాద్‌ మొదలుపెట్టి మేడిపల్లి వరకు అయిదు స్నాచింగ్స్‌ చేశాడు. మరో ఇద్దరు మెడలోని గొలుసులు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక్కడ స్నాచ్‌ చేసిన 18.5 తులాల బంగారంతో నేరుగా అహ్మదాబాద్‌లోని చంద్లోడియా ప్రాంతంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు.  

► సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం 21 రాత్రి గుర్తించిన సిటీ పోలీసులు అహ్మదాబాద్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 22న తెల్లవారుజామున ఉమేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు అతడు ఇక్కడ నుంచి ‘లాక్కెళ్లిన’ బంగారాన్ని అమ్మేందుకు ఆస్కారం లేదు. అయినప్పటికీ అతడి నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా మన బంగారం రికవరీ చూపించలేదు. దీన్ని ఆ అధికారులు తమ వద్ద జరిగిన నేరాల లెక్కలో వేసేసుకున్నారు. 

వరుసపెట్టి పడిపోయిందంటూ..  

► ఇక్కడి పోలీసులు ఉమేష్‌ ఖతిక్‌ను తీసుకురావాలన్నా, నగరంలో నేరాలకు సంబంధించిన బంగారం రికవరీ చేయాలన్నా దానికి అక్కడి పోలీసులకు అతడిచ్చిన నేరాంగీకార వాంగ్మూలమే ఆధారం. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్‌ పోలీసులను సంప్రదించిన ఇక్కడి అధికారులు దాన్ని సేకరించారు. అందులోని అంశాలను చూసిన మూడు కమిషనరేట్ల పోలీసులూ షాక్‌ తిన్నారు. మేడిపల్లిలో స్నాచింగ్‌ మినహా మిగిలిన అన్ని నేరాలను ఇందులో పొందుపరిచారు. వీటిలో కొన్ని స్నాచింగ్‌కు యత్నాలు ఉన్నాయి.  

► తాను ఓ నేరంలో మహిళ మెడ నుంచి లాక్కున్న గొలుసు మరో నేరం చేస్తున్న సమయంలో రోడ్డు పైనో, ఎక్కడో తెలియని ప్రాంతంలోనే పడిపోయిందని ఉమేష్‌ చెప్పినట్లు నమోదు చేశారు. దీని ప్రకారం చూస్తే ఉమేష్‌ నగరంలో స్నాచ్‌ చేసిన 18.5 తులాల బంగారం ఇక్కడే పడిపోయానట్లు లెక్క. ఫలితంగా అహ్మదాబాద్‌ పోలీసులను అడగడానికి కానీ, ఉమేష్‌ నుంచి రికవరీ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు.   

అక్కడివి అమ్మినట్లు రికార్డుల్లో.. 

ఉమేష్‌ ఖతిక్‌పై గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేసినట్లు అహ్మదాబాద్‌లోని వడజ్‌ పోలీసుస్టేషన్‌ అధికారులు మంగళవారం ప్రకటించారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో నేరాంగీకార వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇందులో ఉమేష్‌ గేర్లు లేని వాహనాలను చోరీ చేసి వాటిపై సంచరిస్తూ చైన్‌ స్నాచింగ్స్‌ చేశాడని పొందుపరిచారు.

ఇవన్నీ గతేడాది మే నుంచి నవంబర్‌ మధ్య చోటు చేసుకున్నవే అని చూపించారు. ఆ సొత్తును అహ్మదాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన లబ్ధి జ్యువెలర్స్‌ యజమాని హర్ష భాయ్, మానిక్‌ చౌక్‌లోని హిమ్మత్‌ చౌక్, చాణక్యపురి ప్రాంతానికి చెందిన మహంకాళి జ్యువెలర్స్‌ యజమాని గిరీష్‌ భాయ్‌లకు అమ్మినట్లు రికార్డు చేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top