దారి తప్పుతున్న లాటరీ దర్యాప్తు
అర్ధరారత్రి కూలీలపై కేసులు ఫోన్‌పే నుంచి డబ్బులు తీసుకుంటున్న వైనం ‘కింగ్‌పిన్’లను పట్టుకోలేకపోతున్న పోలీసులు ఎస్పీ కల్పించుకుంటేనే వాస్తవాలు వెలుగులోకి పక్కదారి పట్టిన విచారణ
చిత్తూరు అర్బన్ : చిత్తూరులో నగరంలో నిషేధిత లాటరీ టికెట్ల ముద్రణ, టికెట్లు విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడంలో ఓ పోలీసు అధికారి వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. నగరంలో విచ్చల విడిగా లాటరీ టికెట్ల విక్రయాలు, దానికి అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంపై ‘సాక్షి’ పత్రికలో ఇటీవల ‘పచ్చ లాటరీ’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ దందాపై ఎస్పీ తుషార్ డూడీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్పెష ల్ బ్రాంచ్ విభాగంతో లాటరీ వ్యవహారంపై కీలక సమాచారం తెప్పించుకున్నారు. ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులు, పోలీసులపైనా నిఘా పెట్టారు. దీంతో నెపం తమపై పడుతుందని గ్రహించిన ఖాకీలు ఇటీవల లాటరీ టికెట్ల విక్రయదారులను వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గతంలో లాట రీ టికెట్లు విక్రయించి, ప్రస్తుతం దానిజోలికి వెళ్లకుండా కూలీ పనిచేసుకుంటున్న పేదలపై ఓ ఖాకీ తప్పుడు కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు వ్యక్తులను.. వాళ్ల ఇంటికి వెళ్లి నిద్రలేపి మరీ కేసులు పెట్టారని విమర్శలు ఉన్నాయి. తాము లాటరీ టికెట్లు విక్రయించడంలేదని, కూలీ పనికి వెళుతున్నామని చెబుతున్నా పట్టించుకోకుండా కేసులు పెట్టడంతో పాటు.. ఇద్దరు వ్యక్తుల ఫోన్‌పే నుంచి డబ్బులను సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.


