మారుతున్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
హైకోర్జు జడ్జి జస్టిస్ జయసూర్య
చిత్తూరు అర్బన్ : చట్టాల్లో వస్తున్న మార్పులు, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పులపై ప్రతీ ఒక్క న్యాయమూర్తి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య ఆదేశించారు. శనివారం చిత్తూరు పూర్వపు ఉమ్మడి జిల్లాలోని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జరిగిన సమావేశంలో జస్టిస్ జయసూర్య మాట్లాడుతూ.. చట్టాల్లో వస్తున్న మార్పులపై జడ్జీలకు పూర్తిస్థాయిలో పట్టు ఉండాలన్నారు. అప్పుడే సరైన తీర్పులు వెలువరించే అవకాశం ఉంటుందన్నారు. క్రిమినల్ చట్టంలో నేరాల తీరు, ప్రాసిక్యూషన్ నియంత్రించడం, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు శిక్షలపై చర్చించారు. ఇక కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయమూర్తులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి బి.శ్యాంసుందర్, రిటైర్డు జిల్లా జడ్జి కేపీ బాలాజీ రీసోర్స్ పర్సన్‌గా వ్యవహరించి పలు అంశాలపై ప్రస్తావించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, న్యాయమూర్తులు సూర్యనారాయణమూర్తి, శ్రీనివాసరావు, భారతి, గురునాథ్, అర్చన, రామ్‌గోపాల్ పాల్గొన్నారు.


