చివరి ఆశలు ఆవిరి
నష్టాలబాటలో వరి రైతులు!
పలమనేరు: ఈ సారి వరి రైతులు నిండా మునిగిపోయారు. చెమటోడ్చి పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక కుమిలిపోతున్నారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో ఈ రబీకి సంబంధించి సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సన్నర కాలైన బీపీటీ, నర్మద, అమన్, ధనిష్ట, దొడ్డ రకాలైన జేజేఎల్, ఆర్‌ఎన్‌ఆర్ లాంటి రకాలను సాగుచేశారు. ఇందులో 2 వేల ఎకరాల దాకా ఇప్పటికే ఒబ్బిళ్లు జరిగాయి. మరో వవెయ్యి ఎకరాల్లో వరికోతలు జరగాల్సి ఉంది. కోతలు మొదలుకాగానే ఉన్నట్టుండి ధాన్యం ధరలు తగ్గాయి. మొన్నటి దాకా క్వింటాళ్ ధర రూ.2,500 దాకా ఉండగా ఇప్పుడు రూ.1,800 సైతం పలకడం లేదు. ఒబ్బిళ్ల సమయంలో తుపాన్లు, కూలీలు రాక ఎన్నో ఇబ్బందులు పడి పండిస్తే తీరా రైతుకు మిగిలేది నష్టమే.
ఎకరానికి రూ.40 వేల పెట్టుబడి
ఎకరా పొలానికి వరి విత్తనాలు తెచ్చి నారుమడి వేయడానికి రూ.2 వేలు. ఆపై బురదమడి దున్నడానికి ట్రాక్టరుకు గంటకు రూ.1,200 చొప్పున ఏడు గంటలకు రూ.9,600, మడిచుట్టూ గెనాలు కొట్టేందుకు రూ.2వేలు అవుతుంది. నాటేందుకు ముందు పొలంలో రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువుకు రూ.2,600 అవుతుంది. వరినాట్లకు రూ.7వేలు, ఆపై చెత్త తీసేందుకు రూ.3వేలు అవుతోంది. ఈ సమయంలో యూరియా కోసం రూ.1,200 ఖర్చు పెట్టాలి. పంటకు చీడపీడల నివారణకు రూ.1000 అవుతుంది. పంట కోతకొచ్చాక యంత్రాల ద్వారా అయితే రూ.11వేలు, కూలీల ద్వారా అయితే రూ.10వేలు అవుతుంది. ఇవన్నీ పూర్తయి ధాన్యాన్ని ఎండబెట్టి బస్తాల్లో నింపేందుకు మరో వెయ్యి పెడితే ధాన్యం ఇల్లు చేరుతుంది. మొత్తం మీద నారుపోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరేందుకు ఎకరానికి రూ.40 వేలదాకా ఖర్చవుతోంది.
చేలవద్దే కొంటున్న బయట రాష్ట్రాల వ్యాపారులు
స్థానికంగా వరికి ధర లేదని తెలిసి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు, చింతామణి, శ్రీనివాసపుర తమిళనాడులోని తిమ్మిరి ప్రాంతానికి చెందిన వ్యాపారులు లారీలతో వచ్చి రైతు పొలాల వద్దే నెమ్ముగా ఉన్న ధాన్యాన్ని కొంటున్నారు. ఆపై అక్కడే రైతుకు నగదు చెల్లిస్తున్నారు.
పంటబాగా పండినా..
ఎకరా పొలంలో పంట బాగా పండితే 30 బస్తాలు (బస్తా 80 కేజీలు) లెక్కన 24 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. ఇప్పుడున్న ధరల మేరకు క్వింటాల్ రూ.1,800 చొప్పున రూ.43,200 చేతి కొస్తుంది. ఇందులో రైతు పెట్టిన పెట్టుబడి రూ.40వేలు పోతే చివరికి మిగిలేది రూ.3,200 మాత్రమే.
కొనుగోలు చేయని ప్రభుత్వం
గతంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వ్యవసాయశాఖ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనేవారు. కాని చంద్రబాబు పాలనలో ధాన్యాన్ని కొనకపోగా కనీసం ధర కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించాలని పలువురు కోరుతున్నారు.
చివరి ఆశలు ఆవిరి


