వర్షమొస్తే..గండి పడడం ఖాయం
చిత్తూరు కలెక్టరేట్ : చెరువుల అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. తుపాన్లు వచ్చి గండ్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఊళ్లు మునిగి ప్రాణాలు పోతున్నా కనికరించడం లేదు. గత నెలలో వచ్చిన మోంథా తుపాన్‌తో జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. చాలా చోట్ల కట్టలు బలహీనంగా ఉన్నాయి. లీకేజీ లు అవుతూ స్థానికులను భయపెడుతున్నాయి. మరికొన్ని చోట్ల గండ్లు పడి నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. అయినా వీటి మరమ్మతుకు ఏ ఒక్కరూ స్పందించడం లేదు. పైసా కూడా విదల్చడం లేదు.
ప్రతిపాదనలే..
జిల్లా వ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రతిపాదనలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఒక్కొక్క చెరువుకు రూ.10 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు అవసరమని ప్రతిపాదనలు పంపారు. జిల్లా వ్యాప్తంగా 214 సాగునీటి చెరువుల అభివృద్ధికి రూ.132.98 కోట్ల అంచనాలతో డీపీఆర్ ను సిద్ధం చేసి పంపించారు. చెరువుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరోసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో చెరువుల మరమ్మతులకు రూ.436.98 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇంతవరకు స్పందించ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆయకట్టు రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
రాజీవ్‌నగర్ కాలనీ చెరువుకు గండి
పుంగనూరు: సోమల మండలంలోని రాజీవ్‌నగర్ కాలనీ చెరువుకు గండిపడింది. సుమారు పది రోజులుగా నీరు వృథా అవుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు కింద సుమారు 50 ఎకరాల ఆయకట్టు ఉంది.
దుస్థితిలో కోటచెరువు కట్ట
కార్వేటినగరం: సంస్థానాధీశులు కాలం నుంచి ఉన్న కోటచెరువు కట్ట దుస్థితికి చేరింది. మేజర్ పంచాయతీ కార్వేటినగరానికి సమీపంలో కోటచెరువు, పద్మసరస్సు చెరువులు రెండు కొండల మధ్య ఉన్నాయి. పద్మసరస్సు చెరువు నిండితే మిగులు జలాలు కోటచెరువుకు చేరుతాయి. ఈ రెండు చెరువులు అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. కబ్జాకోరల్లో చిక్కుకుని కుంచించుకుపోతున్నాయి. కట్టలు సైతం బలహీనంగా మారాయి. ప్రమాద వశాత్తు చెరువుకు గండిపడితే కార్వేటినగరంలో సగానికిపైగా ఇళ్లు మునిగిపోయే అవకాశం ఉంది.
భయపెడుతూ..తొణికిసలాడుతూ..
నగరి : నియోజకవర్గంలోని నగరి మండలంలో 34 చెరువులు, విజయపురం మండలంలో 40, నిండ్ర మండలంలో 46, పుత్తూరులో 17, వడమాలపేటలో 25 చెరువులు ఉన్నాయి. వీటిలో 80 శాతం చెరువులు నిండిపోయాయి. గత 16 నెలల కాలంగా చెరువుల నిర్వహణపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆయకట్టు చైర్మన్లుగా పచ్చ నేతలకు కట్టబెట్టింది. వారు ఫ్లెక్సీల్లో పదవులు పెట్టి ఫొటోలు వేసుకోవడం మినహా చెరువుల పరిస్థితిని ఇప్పటి వరకు పరిశీలించ లేదు. చెరువు కట్టలపై పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో కరకట్టలు దెబ్బతినే ఆస్కారం ఉంది. నిండ్ర మండలంలో కావనూరు, తిప్పాపురం, కొప్పేడు, నిండ్ర, అత్తూరు, ఎలకాటూరు చెరువుల తూములు దెబ్బతిన్నాయి. విజయపురం మండలం కళియంబాకం చెరువుకు వరవ కాలువ లేదు. అధికారులు శుక్రవారం వరవ కాలువను బాగు చేశారు.
చెరువు కట్టలు భద్రమేనా?
బంగారుపాళెం: మండలంలో మొత్తం 98 చెరువులు ఉన్నాయి. ఇందులో మొగిలిగౌని చెరువు, బలిజపల్లెలోని చీకల చెరువు, కామాక్షమ్మ చెరువు, జంబువారిపల్లెలోని వెంకటప్పనాయుని చెరువు, మహాసముద్రం చెరువు, గుంతూరులోని వీరప్పనాయుని చెరువు, తుంబపాళెంలోని కొత్త చెరువులు పెద్దవి. 91 చిన్న చెరువులు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండి మొరవ పోతున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల కారణంగా మండలంలోని ఊటువంక కామాక్షమ్మచెరువు నిండిపోయింది. చెరువు కట్ట కింది భాగంలో చెమ్మగిల్లుతుండగడంతో గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు తక్షణం మరమ్మతులు చేశారు. మండలంలోని తుంబపాళెం కొత్తచెరువు ఎడవ భాగంలో మొరవపోతున్న ప్రాంతానికి పక్కన నిర్మించిన రక్షణగోడ లీకేజీ అవుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోతోంది.
గుడిపాల: గుడిపాల మండలంలో మొత్తం 87 చెరువులు ఉన్నాయి. ఇందులో 85 చెరువులు నిండి మొరవ పోతున్నాయి. చెరువుల మరమ్మతులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కొన్ని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని గ్రామస్తులు విన్నవించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. చెరువులన్నీ నిండి ప్రస్తుతం గ్రామాలవైపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని 197రామాపురం గ్రామ చెరువు నిండి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రామాపురం గ్రామంలోని ఇళ్లల్లోకి కూడా నీరు వచ్చేసింది. తహసీల్దార్ శ్రీనివాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వెంగమాంబపురం చెరువు నిండడంతో తారురోడ్డుపైకి నీరు చేరింది. రోడ్డు పక్కన కొంతభాగం రోడ్డు కోతకు గురైంది. గుడిపాల, నారగల్లు చెరువులు నిండి మొరవపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షమొస్తే ఇక అంతేసంగతులు..!


