 
															ఆరోగ్య కేంద్రాలు అలర్ట్
– 3న జిల్లాకు కేంద్ర బృందం రాక
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కేంద్ర బృంద పర్యటన ఖరారుతో ఆరోగ్య కేంద్రాలు అలర్ట్ అయ్యాయి. మగ్గిన, గడువు తీరిన మందులను మాయం చేస్తున్నాయి. జిల్లాలో పీహెచ్‌సీలు 50, విలేజ్ హెల్త్ క్లినిక్ 464, అర్బన్ హెల్త్ సెంటర్ 15 దాకా ఉన్నాయి. వీటిలో వైద్య, ఆరోగ్య సేవలు అంతంత మాత్రమే. క్షేత్ర స్థాయిలో పనిచేసే పలువురు ఏఎన్‌ఎంలు ప్రజారోగ్యంపై చిన్నచూపు చూస్తున్నారు. సర్వేలు, ఇతరాత్ర పనులకు పరిమితమవుతున్నారు. ప్రభుత్వం అందించే మందులు, మాత్రలను ఇవ్వకుండా....ప్రైవేటు ఆస్పత్రులు, ఆర్‌ఎంపీలకు రెఫర్ చేస్తున్నారు. ఈ కారణంగా విలువైన మందులు, మాత్రలు క్షేత్ర స్థాయిలో పేరుకుపోయి చివరకు రోడ్డుపాలవుతున్నాయి.
నవంబర్ 3న కేంద్ర బృందం రాక
నవంబర్ 3వ తేదీన జిల్లాకు కామన్ రివ్యూ మిషన్ (కేంద్ర బృందం) రానుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమ అమలుతీరుపై పరిశీలించనుంది. పది మందితో కూడిన బృందం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. మొత్తం 32 అంశాలపై లోతుగా ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య అప్రమత్తవుతోంది.
తప్పులు సరిదిద్దుకునే పనిలో...
కేంద్ర బృందం రాకను పసిగట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్, ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాలోని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే పలువురు ఏఎన్‌ఎంలు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. వారి పరిధిలోని రికార్డులను సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. పేరుకుపోయిన మందులు, మాత్రలను తీసి బయట పడేస్తున్నారు. గడువు తీరిందని సాకు చూపించి చెత్తకుప్పల్లో వేస్తున్నారు. అధికారులు సైతం జిల్లాకు చెడ్డపేరు రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.
 
							ఆరోగ్య కేంద్రాలు అలర్ట్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
