 
															కన్నీటితో సాగు!
జిల్లాపై పగబట్టిన ప్రకృతి నిండా ముంచేసిన మోంథా తుపాను వరి ఆశలు నేలమట్టం దెబ్బతీసిన ఉద్యాన పంటలు అప్పుల ఊబిలో అన్నదాతలు నష్టపరిహారం కోసం ఎదురుచూపులు మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి నేతలు
పరిహారం కోసం ఎదురుచూపు 
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో సుమారుగా 1.80 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా మామిడి, వరి, వేరుశనగ, పండ్ల తోటలు, టమాటా, కూరగాయలు సాగు చేస్తున్నారు. వీరి బతుకులపై ప్రకృతి పగబట్టింది. ఓ పక్క ఎండలు, మరో వైపు వర్షాలు, ఇంకో వైపు తెగుళ్లు దాడి చేయడంతో అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది.
వేధిస్తున్న అప్పులు
ఎకరా విస్తీర్ణంలో పంట వేయాలంటే రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వ్యయమవుతోంది. చేతిలో చిల్లిగవ్వలేక.. పెట్టుబడి పెట్టలేక అప్పులు చేయాల్సి వస్తోంది. పట్టా పుస్తకాలు ఎత్తుకుని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. భార్య మెడలోని పుస్తెలు తాకట్టుపెట్టి పెట్టుబడి పెట్టినా పంట చేతికొస్తుందనే నమ్మకం లేకుండా పోయింది.
ప్రకృతి ప్రకోపం
పచ్చని పంటలపై ప్రకృతి విలాయతాండవం చేస్తోంది. రైతులు పండించిన పంటలను ఎందుకూ పనికిరాకుండా చేస్తోంది. 2024లో అదునుకు తగ్గ వర్షాలు లేక వేరుశనగ పంట తీవ్రంగా నష్టపోయింది. 9 వేల హెక్టార్లల్లో నష్టం జరిగినట్లు అంచనా వేసి అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు నివేదికలు ఇచ్చారు. కేంద్ర బృందం కూడా కరువు మండలాలను సందర్శించింది. కానీ ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఈ సారి వేరుశనగ సాగు ఘణనీయంగా తగ్గింది. అలాగే మామిడి పంట అతలకుతలం చేసింది. వరి కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడించింది. ఈ మధ్య కాలంలో వేరుశనగ, వరి, టమాటా, కూరగాయలు, పూలతోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట నష్టం సుమారుగా రూ.25 కోట్ల వరకు ఉంటుంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు వరి 430 ఎకరాలు, బొప్పాయి 7 ఎకరాలు, పూలు 5 ఎకరాలు, టమాట 13 ఎకరాలు, కాలీఫ్లవర్ 5 ఎకరాలు, పొట్లకాయ 2 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దీని విలువ ప్రాథమిక అంచనా ప్రకారం రూ.77 లక్షల వరకు ఉంటుంది. ఈ మేరకు అధికారులు నివేదికలు ఇచ్చినా ఇంతవరకు పరిహారం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దెబ్బతిన్న పంటల పరిశీలన
గుడిపాల: తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను గురువారం జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సందర్శించారు. మండలంలోని పేయనపల్లెలో వరి, తుమ్మలవారిపల్లెలో దెబ్బతిన్న వేరుశనగ పంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు నివేదికలు పంపుతామని, పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి వారికి లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు. వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమ, వ్యవసాయాధికారి సంగీత పాల్గొన్నారు.
 
							కన్నీటితో సాగు!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
