 
															పెళ్లి పేరిట బాలికపై లైంగికదాడి
– 20 ఏళ్ల జైలుశిక్ష
చిత్తూరు లీగల్ / చిత్తూరు అర్బన్: ప్రేమించాను, నిన్నే పెళ్లిచేసుకుంటానని చెప్పి.. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ పూల నరేంద్రరెడ్డి (31) అనే ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన నరేంద్రరెడ్డి ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నాని ఆమెను నమ్మించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని, ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. విషయం తెలుసుకున్న బాలి క తండ్రి నవంబరు 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలికపై లైంగికదాడి చేసినందుకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టుకు తరలించగా నేరం రుజువయ్యింది. దీంతో ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పునిచ్చారు. బాధితు రాలి కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
