చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వేలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో సర్వే, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండవ, మూడవ విడత రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మూడవ విడత సర్వేలో సుమోటో కరెక్షన్‌లను నవంబర్ 10 లోపు పూర్తిచేయాలని చెప్పారు. భూ రికార్డులలో సవరణలు, పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్ దరఖాస్తులతో సహా భూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వీఆర్‌వో, విలేజ్ సెక్రటరీలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకే పరిష్కారం చూపించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
జిల్లాలో రీ సర్వే ఇలా..
జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఫైలెట్ ప్రాజెక్ట్ లో 31 గ్రామాల్లో 30,774 ఎకరాల భూమిని సర్వే చేశారని కలెక్టర్ వెల్లడించారు. రెండవ విడతలో నగరి, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లో 38 గ్రామాల్లో 40,359 ఎకరాల భూమి సర్వే చేసినట్లు తెలిపారు. మూడవ విడతలో 12 గ్రామాల్లో 3,859 ఎకరాల భూమిని రీ సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం 2026 మార్చి 31కి పూర్తవుతుందన్నారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, సర్వే శాఖ జేడీ జయరాజ్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
