గ్రానైట్ లారీ సీజ్
బంగారుపాళెం: అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని సోమవారం అధికారులు సీజ్ చేశారు. మండలంలోని జంబువారిపల్లె వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రానైట్ క్వారీ కొనసాగిస్తున్నాడు. గతంలో ఈ క్వారీకి సంబంధించి సాయిరెడ్డి అనే వ్యక్తి అనుమతులను పొంది ఉన్నాడు. అయితే సదరు క్వారీకి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీపై సాయిరెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు గ్రానైట్ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మామిడి రైతుల నిరీక్షణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం మామిడి రైతులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం అందించిన రూ.4 ప్రోత్సాహక నిధి కొన్ని వేలమందికి జమ కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో బిల్లుల్లో జాప్యం, చెల్లింపులో గందరగోళం నెలకొంది. మామిడి రైతులు బిల్లులు చేతబట్టుకుని జిల్లా కార్యాలయానికి క్యూకడుతున్నారు. నగదు రాలేదని నివేదించుకుంటున్నారు. సోమవారం కూడా జిల్లా కార్యాలయం ఎదుట నిరీక్షించారు.
అత్యుత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి
చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన జిల్లాలోని అత్యుత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి అందజేయనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడాకారులు శాప్ క్రీడా యాప్‌లో సహాయక పత్రాలతో నవంబర్ 4లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
గ్రానైట్ లారీ సీజ్


