పూల తోట ధ్వంసం
కుప్పం: మండలంలోని ములకలపల్లిలో రీ సర్వేలో అధికారులు చేసిన తప్పులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఇతరులు తన భూమిలోకి వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నారని బాధితుడు మునిరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునిరత్నం 40 ఏళ్ల క్రితం ములకలపల్లి గ్రామ రెవెన్యూ లెక్క దాఖలోని సర్వే నంబర్ 9/3బీ1లో 0.50 సెంట్ల భూమిని కోనుగోలు చేశాడు. రెవెన్యూ రికార్డుల్లో సైతం మునిరత్నం పేరు ఉంది. అధికారులు రీ సర్వే చేసిన సందర్భంలో మునిరత్నంతో పాటు చిన్నక్కకు జాయింట్ ఎల్‌పీ నంబరు ఇచ్చారు. దీంతో వివాదం నెలకొంది. ఆ భూమిపై హక్కులేని చిన్నక్క కుటుంబ సభ్యులు తనపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. 6 నెలలుగా సాగుచేసిన కనకాంబరం పంటను నాశనం చేసి తీవ్రంగా నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై విచారణ చేయడంతోపాటు భూమిని సర్వే చేసి న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.


