
ఐషర్‌ను ఢీకొన్న బైక్
చంద్రగిరి : ఎదురుగా టమాట లోడుతో వస్తున్న ఐషర్ లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన ఘటన తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి పీటీసీ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భాకరాపేటకు చెందిన మహబూబ్ బాషా(58) మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో పీటీసీ సమీపంలోని పెద్ద మలుపు వద్ద వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న టమాట లోడుతో వస్తున్న ఐషర్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో బైక్‌తో పాటు ఐషర్ వాహనం అదుపుతప్పి కల్వర్టు పక్కన ఉన్న భారీ లోతు ప్రాంతంలో బోల్తా పడడంతో టమాటా బాక్స్‌లు , బైక్ మహబూబ్ బాషాపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐషర్ వాహనంలోని డ్రైవరుతో పాటు క్లీనర్ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.