
సిఫారసుకే పెద్దపీట
మతలబు ఏంటీ?
ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 664 మందికి బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆది, సోమవారాలతో కలిపి మొత్తం 469 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేపట్టారు. మిగిలిన 195 మందికి చేయలేదు. సీఎం కార్యక్రమం ఉండడంతో వీటిని అనధికారికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. హడావిడిగా ఈ ప్రక్రియను ముగించి అధికారులు వెళ్లిపోయారు. మిగిలిన వారికి ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తారో అనే విషయం పై సృష్టత లేదు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లో కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు సమాచారం.
చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ ఇంజినీర్ సహాయకుల బదిలీల్లో సిఫారసుకే పెద్దపీట వేశారు. ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వారికి చెప్పిన చోటుకు బదిలీ చేశారు. ఏ పలుకుబడీ లేని వారి పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం రెండో రోజు జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఉద్యోగులు ఆరోపించారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. తమశాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగులని ఏమాత్రం గౌరవం లేకుండా ఎస్‌ఈ కార్యాలయ సిబ్బంది హేయ్, రేయ్, చెప్పింది చేసి పో అంటూ ఏకవచనంతో మాట్లాడుతూ వారితో అమర్యాదగా ప్రరవర్తించారని ఇంజినీరింగ్ సహాయకులు అసహనం వ్యక్తం చేశారు.
ర్యాంకులు పట్టించుకోరు
తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగాలు ఎలా కేటాయించారో అలాగే బదిలీలు చేపట్టాలని, జాబితాలు సిద్ధం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అయినా అధికారులు వాటిని పట్టించుకోలేదు. ప్రతిభను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు.
సీనియారిటీ జాబితా లేకుండానే
ఏ శాఖలో అయినా సీనియారీ జాబితా ప్రదర్శించి దా ని ఆధారంగానే బదిలీలు చేస్తారని, అయితే సచివాల య ఉద్యోగుల విషయంలో అలా ఎందుకు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీనియారిటీ జాబితా రూపొందించకుండా ప్రాంతాలను కోరుకోమని, వాటి ని ఫారంలో నింపి వెళ్లిపోవాలని సూచించడం నిబంధనలకు విరుద్ధమని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ర్యాంకు ఉన్నా
దూరంగానే పోస్టింగ్
పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం
అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం
ముగిసిన కౌన్సెలింగ్
లెటర్లు ఉన్నవారికి ప్రాధాన్యం
ఎమ్మెల్యే లెటర్లు ఉన్నవారికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. సిఫార్సు ఉన్నవారికి వారు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరికొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫార్సు చేయడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి ఈఈ రామ్మోహన్, మదనపల్లె ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే ఏ మాత్రం పలుకుబడి లేని వారికి అడిగిన చోటు కాకుండా ఇష్టం వచ్చిన చోటుకు బదిలీ చేశారు.

సిఫారసుకే పెద్దపీట