
పచ్చమేత
● బియ్యం అక్రమ రవాణాలో బరితెగించిన టీడీపీ నేతలు ● పీడీఎస్ బియ్యంతో పాటు టీడీపీ నేతల అరెస్ట్ ● సుమారు రూ.6 లక్షల విలువ చేసే 13 టన్నుల బియ్యం స్వాధీనం
నగరి : అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచుకున్న 13 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరి మున్సిపాలిటీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ విక్రమ్ కథనం మేరకు.. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు రేషన్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న జోర్ ఎంజాయ్ హోటల్ పక్కన ఖాళీ ప్రదేశంలో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. సీఐ తన సిబ్బందిని వెంటబెట్టుకుని రెవెన్యూ అధికారులు, వీఆర్వోతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నాలుగు చిన్న వాహనాలు, ఒక ఐచర్‌లో లోడ్ చేసి ఉంచిన 13 టన్నుల బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ నాయకుడు అమృతరాజ్ నాడార్ అలియాస్ టీఆర్‌ఎస్(62), వై.ధనుష్ (19), డీ.బోస్ (20), ఎన్.రోహిత్ (18), వీ.దినేష్ (23), గజేంద్రన్ (20), రాజేష్ అలియాస్ రాజు (25) మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నగరి, నారాయణవనం, పుత్తూరు, పిచ్చాటూరు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం సేకరించుకుని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు ఎక్కడకు పంపుతున్నారు.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న చైన్ లింక్‌ను పూర్తి స్థాయిలో కూపీలాగి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
పట్టుకున్నవి ప్రభుత్వ ముద్రతో సీలు ఉన్న బస్తాలే
పోలీసులు సోమవారం పట్టుకున్న పీడీఎస్ బస్తాలన్నీ ప్రభుత్వ ముద్రతో సీలున్న బస్తాలే కావడంతో గోడౌన్ నుంచి వచ్చాయా.. రేషన్ షాపుల నుంచి వచ్చాయా అనే అంశాలపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చమేత