
ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందాం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించుకుందామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆదివారం జిల్లా కార్యాలయంలో జిల్లాస్థాయి యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి, మంచి విద్యను అందించి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించి ప్రభుత్వ పాఠశాలను విద్యా కేంద్రాలుగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం జీఓ 19ని అమలు చేసి 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,652 మోడల్ ప్రాథమిక స్కూళ్లు, 1–10 తరగతుల ఉన్నత పాఠశాలలు 1552, ప్రాథమికోన్నత స్కూళ్లను అప్‌గ్రేడ్ చేయగా 779 ఉన్నత పాఠశాలలు, ఫౌండేషన్ స్కూళ్లు 5000, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు 19,000 ఏర్పాటు చేశారన్నారు. ఈ విధానం వల్ల ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన స్కూళ్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారానే ప్రభుత్వ విద్యారంగం మనుగడ సాధ్యపడుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు సోమశేఖరనాయుడు, మణిగండన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు చేపడుతున్న నమోదు డ్రైవ్‌లో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలన్నారు. 10 మంది పిల్లలను చేర్పించిన వారికి మండల స్థాయిలో, 20 మందిని చేర్పించిన వారికి జిల్లాస్థాయిలో అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు ఊరి బడిలో పిల్లలను చేరుద్దాం అనే కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో ఆ సంఘం సహాధ్యక్షులు ఎస్ రెహనా బేగం, కే రెడ్డప్ప నాయుడు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్పీ బాషా, పిఆర్ మునిరత్నం, జిల్లా కార్యదర్శులు ఏ కష్ణమూర్తి, సిపి ప్రకాష్, కె సరిత, టి. దక్షిణామూర్తి, పంటపల్లి సురేష్, ఎం పార్థసారథి, పి సి బాబు, శశి కుమార్, ఎంసీ నిర్మల, తుంబూరు బాలాజీ, సాధన కుమార్, ఎస్ వి రమణ, మోహన్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
‘ఊరి బడిలో పిల్లలను చేరుద్దాం’
కరపత్రిక ఆవిష్కరణ
సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ