
నేటి నుంచి పుర కార్మికుల సమ్మె ఉధృతం
చిత్తూరు అర్బన్ : మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఉద్యోగులు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం కార్మికులు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్, ఇతర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదన్నారు. సోమవారం నుంచి కార్మికులు ఎవరూ నీటి సరఫరా విధులకు హాజరుకాబోరని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళుతున్నట్లు కమిషనర్‌కు స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శరవణ, శివకుమార్, వెంకటేష్, హరికృష్ణ పాల్గొన్నారు.