
నేడు ‘రీకాల్ బాబు మేనిఫెస్టో’ పోస్టర్ ఆవిష్కరణ
చిత్తూరు కార్పొరేషన్ : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు మరిచారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం దీనిపై పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పోస్టర్‌ను విడుదల చేయనున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గ నాయకులతో సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణకర్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా వస్తారన్నారు. బాబు ఘ్యూరిటీ..మోసం గ్యారెంటీ అనే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల హామీల ద్వారా ప్రజలు పొందాల్సిన లబ్ధి ఇతర విషయాలు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, క్షేత్రస్థాయిలో నిర్వహణ తదితర అంశాలపై ముఖ్య నాయకులు దిశా నిర్దేశం చేస్తారన్నారు. నియోజకవర్గంలోని నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజయానందరెడ్డి కోరారు.