
టీడీపీలో కుమ్ములాట
పాలసముద్రం : మండలంలోని తెలుగుదేశం గ్రామ స్థాయి కమటీల నియామకంలో గురువారం శ్రీకావేరిరాజుపురంలో జరిగిన కార్యక్రమంలో మండలంలో ఇరువర్గాలు కుమ్ములాడుకున్నాయి.. టీడీపీ పాలసముద్రం మండల అధ్యక్ష పదవికి మండలంలో నెల రోజులుగా ఎమ్మెల్యే, చిట్టిబాబు నాయుడు వర్గాల నడుమ విబేధాలు ఎక్కువయ్యాయి. పార్టీ మండల అధ్యక్ష పదవికి అధిస్థానం గ్రామస్థాయి కమిటీ నమోదు చేసుకుని, అందులో ఎక్కువ మంది ఎవరికి అమోదం తెలుపుతారో అతన్ని మండల అధ్యక్షుడిగా నియమించకోవచ్చని చెప్పడంతో మండంలో ఎమ్మెల్యే.. చిట్టిబాబు నాయుడు ఇరుఇర్గాలు గ్రామస్థాయి కమిటీ నియామకానికి కుమ్ములాడుకుంటున్నాయి. కమిటీ నమోదు చేయడానికి వచ్చిన అబ్జర్వర్లు కూడా నాయకులు చేస్తున్న గొడవలు చూసి గ్రామస్థాయి కమిటీలు నియామకం చేయకుండా పేరు నమోదు చేసుకుపోతున్నారు. మండలంలో ఎమ్మెల్యే ఎవరిని అమోదిస్తారో వారికే మండల అధ్యక్ష పదవి వస్తుందని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు.
కొలమాసనపల్లి అడవిలో పేకాట
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి, గొల్లపల్లి అటవీప్రాంతంలో రహస్య ప్రదేశంలో పేకాట సాగుతోందని తెలిసింది. కొందరు అధికారపార్టీ అండతో పేకాటను నడిపిస్తున్నట్టు సమాచారం. అడవిలోని రహస్య ప్రదేశంలో స్థానికులే కాకుండా బయట రాష్ట్రాలకు చెందిన వారు సైతం వచ్చి ఇందులో పాల్గొంటున్నట్టు తెలిసింది. గతంలో ఇదే అడవిలో పేకాట ఆడుతుండగా స్థానిక పోలీసులు, స్పెషల్ బ్రాంచి సిబ్బంది మూకుమ్మడి దాడులు చేసి, పేకాటరాయుళ్లను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్పీ పీడీ యాక్టు నమోదు చేసి జిల్లా బహిష్కరణ సైతం విధించారు. మళ్లీ కూటమి రాకతో ఓ పోలీసు కానిస్టేబుల్ సహకారంతో ఓ వ్యక్తి అడవిలో జూదం నడిపిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడికి నిత్యం పెద్దసంఖ్యలో జూదగాళ్లు బైకులపై వచ్చి వాటిని రహస్యంగా దాచి అక్కడి నుంచి కాలినడకన వెళ్లి ఆటలో పాల్గొంటున్నారని సమాచారం. ఈ అడవిలోకి వెళ్లే మార్గంలో ఎవరు లోనికొస్తున్నారని తెలుసుకొని సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఇరువురు ఏజెంట్లు ఉన్నట్టు తెలిసింది. వీరు ఈలలు వేయడం, సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ లివ్వడం ద్వారా జూదగాళ్లకు వద్దకు ఎవరూ వెళ్లకుండా కాపుగాస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికారులైనా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు.
గురుకుల టీచర్లకు బదిలీలు నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీజీటీ, పీజీటీలకు బదిలీలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం కోరారు. ఆ సంఘ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ పద్మజను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా, టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లకు సకాలంలో జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఆర్‌జేసీ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటం ప్రదర్శించాలన్నారు. ఆరో తరగతి పాఠ్యాంశాల్లో అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు డీసీఓను శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు మురళి, భాస్కర్, షణ్ముగం, పొన్నయ్య, సంతానం తదితరులు పాల్గొన్నారు.