వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు | - | Sakshi
Sakshi News home page

వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు

Jun 27 2025 4:19 AM | Updated on Jun 27 2025 4:19 AM

వేల స

వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు

చిత్తూరు కలెక్టరేట్‌ : తల్లికి వందనం పథకం.. తల్లులకు పరీక్షగా మారింది. పలు రకాల కారణాలతో పథకం అమలు కాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి జాబితాలో పథకం వర్తించని పిల్లలు రెండో జాబితాకు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో గ్రీవెన్స్‌ స్వీకరిస్తుండడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఎవరు ఏ సమస్యతో అనర్హత జాబితాలో ఉన్నారో పేర్ల వారీగా వివరణ ఉన్న జాబితాలను ఇప్పటికే సచివాలయాల్లో ప్రదర్శించడంతో వాటి ఆధారంగా తగు పత్రాలను జతచేసి గ్రీవెన్స్‌కు దరఖాస్తులు ఇస్తున్నారు. ఈ క్రమంలో జత చేయాల్సిన పత్రాల కోసం రెండు జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తల్లులు చక్కర్లు కొడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఏటా పకడ్బందీగా అమలు చేశారు. తల్లులకు ఎలాంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి, నేరుగా ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక వేళ పొందలేని వారికి తిరిగి మరోసారి అవకాశం కల్పించి, ఏటా డిసెంబర్‌లో అమ్మఒడి పథకం అందజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేసిన మొదటి సారే గందరగోళ పరిస్థితి తలెత్తేలా అర్హులకు నష్టం కలిగేలా పథకాన్ని అమలు చేసింది.

రెండు జిల్లాల్లో 12,589 అర్జీలు

చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని సచివాలయాల పరిధిలో 1,327 సచివాలయాల పరిధిలో 12,589 అర్జీలు పోటెత్తాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోని 612 సచివాలయాల పరిధిలో 5,897 వరకు అర్జీలు వచ్చాయి. అర్జీల్లో ఎక్కువశాతం విద్యుత్‌ బిల్లుకు సంబంధించినవే. పథకం వర్తించని వారు విద్యుత్‌ కార్యాలయాల వద్దకు వెళ్లి ఏడాది విద్యుత్‌ వినియోగ బిల్లులు తీసుకుని అర్జీలతో జత చేయడం విశేషం. తమ పేరుపై అనేక విద్యుత్‌ మీటర్లు సీడింగ్‌ అయి ఉన్నాయని వాటిని తొలగించాలనే అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లా ట్రాన్స్‌కో పరిధిలో సీడింగ్‌ సమస్య అర్జీలు 1,789 వరకు ఉండగా, తిరుపతి జిల్లాలో 1,815 వరకు ఉన్నాయి. తమ కారు విక్రయించినా పథకం అమలు కాలేదని అనేక అర్జీల్లో తల్లులు ప్రస్తావించారు. ఆదాయ పన్ను దరఖాస్తులదీ ఇదే తీరు. వివాహం తర్వాత తాము కుటుంబం నుంచి విడిపోయి విడిగా ఉంటున్నా ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆదాయం చూపించి తీసేశారంటూ అర్జీల్లో అనేక మంది పేర్కొన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి అనేక మంది అర్జీలు దాఖలు చేశారు.

సర్టిఫికెట్లకు ఇబ్బందులు

చిత్తూరు జిల్లాలో మొత్తం 1,30,382 మందిని, తిరుపతి జిల్లాలో 2,10,407అర్హులుగా గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 98748 మంది అనర్హుల జాబితాలో ఉన్నారు. రెండు జిల్లాల్లో అధిక శాతం మందికి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాలేదు. అనర్హత జాబితాలో ఉన్న వారు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. గ్రీవెన్స్‌ దరఖాస్తుతోపాటు జత చేయాల్సిన సర్టిఫికెట్లను పొందడంలో ఆలస్యం అవుతుండడంతో ఇంకా సగం మందికిపైగా సవరణ/ ఫిర్యాదు దరఖాస్తులు సమర్పించాల్సి ఉందని తెలుస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలల్లో అనర్హులుంటే కేవలం 12,589 అర్జీలు రావడమే అందుకు ఉదాహ రణ. సచివాలయ సిబ్బందికి తల్లికి వందనం గ్రీవెన్‌న్స్‌పై అవగాహన లేకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

తల్లికి కూటమి పరీక్ష

సచివాలయాల వద్ద క్యూ కట్టిన అనర్హులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా అర్జీలు

రెండు జిల్లాల్లో 12 వేలకు పైగా దరఖాస్తులు

అధికంగా విద్యుత్‌ బిల్లులు, కారు, ఐటీ కారణాలు

వైఎస్సార్‌సీపీ సర్కారు పాలనలో పారదర్శకంగా అమ్మఒడి

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏ ముహూర్తాన ఈ పథకం అమలు చేసిందో కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లుల్లు సమస్యలతో అల్లాడుతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా మంది అర్హులకు ఈ పథకంలో కోత విధించారు. గతంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకంలో అనర్హులుగా గుర్తించారు. అలాగే విద్యుత్‌ బిల్లులు, కారు, ఐటీ వంటివి వర్తించనప్పటికీ చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సచివాలయాల వద్ద అనర్హుల జాబితాలో ఉన్న తల్లులు అర్జీలను చేతపట్టుకుని క్యూ కట్టారు. ఈ పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం తల్లులకు పరీక్ష పెట్టినట్టుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తల్లికి వందనం పథకంలో అనర్హులైన తల్లుల కష్టాలపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌ కథనం.

‘తల్లికి వందనం’ పథకం తమకు వర్తింపజేయాలంటూ చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా వేల సంఖ్యలో అర్జీలు పోటెత్తుతున్నాయి. తమకు అర్హత ఉన్నా పలు కారణాలతో జాబితాలో పేర్లు లేకుండా చేశారంటూ వేలాది మంది తల్లులు సచివాలయాలకు క్యూకడుతున్నారు. ఎప్పుడో కారు విక్రయించినా కారు ఉందనే సాకుతో పథకం నుంచి తొలగించారని కొందరు.. విద్యుత్‌ బిల్లు 300 యూనిట్లు అధికంగా చూపడంతో డబ్బులు పడలేదని మరికొందరు.. మూడేళ్ల కింద ఆదాయపు పన్ను చూపించి డబ్బులివ్వలేదని ఇంకొందరు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలు, రేషన్‌కార్డు సమస్యలున్న కుటుంబాలు ఇలా రకరకాల కారణాలతో తమను పథకానికి దూరం చేశారంటూ వాపోతున్నారు. అర్హులుగా నిర్ధారించి డబ్బులివ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 12,589 మంది తల్లులు అర్జీలు దాఖలు చేశారు. వీరిలో అర్హులుంటే వచ్చేనెల 5వ తేదీన తిరిగి ప్రభుత్వం డబ్బులు జమచేయనుంది. ఈ నేపథ్యంలో అధికారులు మళ్లీ ఈ అర్జీలను పునఃపరిశీలిస్తున్నారు. ఈ పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న తల్లులకు క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైనట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది.

పరిశీలనలో అలసత్వం

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆయా శాఖల అధికారులు పరిశీలనలో అలసత్వం చూపిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కారు సంబంధిత అర్జీ సమస్యను ఆయా జిల్లా రవాణా శాఖకు నేరుగా సచివాలయాలు పంపి ఆరా తీస్తున్నాయి. అయితే ఆ అర్జీల పరిష్కారంలో ముందడుగు పడడం లేదు. ఆదాయ పన్ను అర్జీలను తహసీల్దార్లకు లాగిన్‌లో పంపుతున్నారు. ఆ అర్జీలను తహసీల్దార్లు అస్సలు పట్టించుకోవడం లేదు. కొంత మంది తహసీల్దార్లు పరిష్కరించి ఆర్డీఓ లాగిన్‌లకు పంపుతున్నారు. పనిఒత్తిడిలో ఉన్న ఆర్డీఓలు వాటిని పట్టించుకోని దుస్థితి ఉంది. విద్యుత్‌ బిల్లులకు సంబంధించిన అర్జీలను ఆ శాఖ అధికారులు తిరస్కరిస్తున్నారు. వీరికి పథకం వర్తించదని నిర్ధారించి, సచివాలయాల దశలోనే రెండోసారి అనర్హత కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ నెలాఖరులోగా అర్హుల జాబితా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే రెండు జిల్లాల్లో ఈ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించని దుస్థితి నెలకుంది.

వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు 1
1/2

వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు

వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు 2
2/2

వేల సంఖ్యలో పోటెత్తిన అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement