పుంగనూరు(చౌడేపల్లె) : కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం మండలంలోని సింగిరిగుంటలో జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సురేష్ భార్య వెంకటమ్మ (39) కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుండేది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకులకు తీవ్రగాయాలు
పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ గ్రామం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. తొట్టికండ్రిగ గ్రామంలో గంగజాతర పురస్కరించుకుని పరిసరాలు శుభ్రం చేసి, జేసీబీని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన జేసీబీని ఢీకొన్నారు. దీంతో ఇద్దరి యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108 వాహనంలో సోళింగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు.
ప్రెస్, పోలీసు స్టిక్కర్లు అనధికారికంగా
వేసుకుంటే చర్యలు
పలమనేరు : జిల్లాలో కొందరు జర్నలిస్టులు కాకున్నా వారి వాహనాలపై ప్రెస్ అని, పోలీసులు కాకున్నా పోలీస్ అని, సైనికులు, పలు డిపార్ట్‌మెంట్ల పేర్లతో పేర్లు రాసుకొని తిరుగుతున్నారని వీరిపై చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు కాకున్నా యూట్యూబ్ విలేకరులమంటూ కొందరు, తాము పోలీసుల బంధువులమంటూ మరికొందరు, వివిధ శాఖలకు సంబంధించి వాహనాలు, ద్విచక్ర వాహనాలపై రాసుకున్న వారిపై తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సంబంధం లేకుండా బైక్‌లపై ప్రెస్ స్టిక్టర్ వేసుకున్న వారిపై చర్యలు తప్పవన్నారు. కేవలం జిల్లా కలెక్టర్ ద్వారా అక్రిడేషన్ కలిగి ఉన్న విలేకరులు మాత్రమే బైక్‌లపై ప్రెస్ అని వేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన స్టిక్కర్లను తమ శాఖ ద్వారా అందించనున్నట్లు తెలిపారు.
మట్టి గణపతిని పూజించాలి
కాణిపాకం : వినాయక చవితి దృష్ట్యా భక్తులు మట్టి గణపతిని పూజించి.. ప్రకృతికి హాని కలగకుండా చూడాలని ఈఓ పెంచల కిషోర్ అన్నారు. కుమారస్వామి అనే భక్తుడు రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తొలుత ఆ మట్టి గణపతి పంపిణీని బుధవారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో ప్రారంభించారు. ఈఓ ఈ పంపిణీని ప్రారంభిస్తూ..మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు.
మహిళ ఆత్మహత్యాయత్నం