
డ్రోన్లతో నిఘా పెంచండి
–ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు అర్బన్: అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా జిల్లాలో డ్రోన్లతో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో బుధవారం పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ప్రజలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా డ్రోన్ల సాయంతో నిఘా పెంచాలన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేర పరిశోధన చేయాలన్నారు. శాంతిభద్రతల పరిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్‌మిత్రను సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి పేరుతో మోసం
చిత్తూరు అర్బన్ : తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై ఓ యువతి మంగళవారం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఎస్‌ఐ నాగసౌజన్య వివరాల మేరకు.. రామ్‌నగర్ కాలనీకి చెందిన జాహిద్, గిరింపేటకు చెందిన రేష్మ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబాలకు తెలిపి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో రేష్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో జావిద్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను మోసం చేసిన జావిద్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు రేష్మ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.