
అంగన్‌వాడీల తనిఖీ
నగరి : నిండ్ర మండలం అత్తూరు అంగన్‌వాడీ సెంటర్‌లో గర్భిణులకు పురుగు పట్టిన కందిపప్పు ఇవ్వడాన్ని వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘జల్లించి.. ఎండలో వేసి..వండి పెట్టేయండి’ అంటూ వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం సీడీపీఓ ఇందిరా ప్రియదర్శిని అత్తూరు అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. పిండి అయిన కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు ప్యాకెట్లను గర్భిణులు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 202 అంగన్ వాడీ కేంద్రాలకు సివిల్ సప్లై గోడౌన్ నుంచి చౌక దుకాణాల ద్వారా 2476 కేజీల కందిపప్పు సరఫరా అవుతుందని ఇందులో చాలా వరకు పాడైపోయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవ్వరికీ సరఫరా చెయ్యకండని అంగన్‌వాడీ సెంటర్లకు కూడా ఆదేశించడం జరిగిందన్నారు. అత్తూరు సెంటర్‌లో మాత్రమే సమాచారం అందకా సరఫరా జరిగిందని దానిని కూడా సరిదిద్దడం జరిగిందన్నారు. సివిల్ సప్లై గోడౌన్ డీటీతో మాట్లాడి 821 కేజీల పాడైన కందిపప్పు వాపసు ఇవ్వడం జరిగిందని ఆ స్థానంలో మంచి కందిపప్పు అందించామన్నారు. ఆమె వెంట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.వెంకటేశులు, ఉపాధ్యాయులు లోకేశ్వరి, ప్రమీల, డీలర్ చంద్రకళ పాల్గొన్నారు.

అంగన్‌వాడీల తనిఖీ