
మేం చూసుకుంటాం.. నువ్వు నిర్మించుకో!
పలమనేరులో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు
● అధికారులు, నేతల అండతో సాఫీగా పనులు ● రాత్రికి రాత్రే వెలుస్తున్న భవనాలు ● నోరుమెదపని మున్సిపల్ అధికారులు
పలమనేరు: ‘చూడబ్బా అధికారం మాది. పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాం.. ఇప్పుడు సంపాదించుకోకుండా ఇంకెప్పుడు సంపాదించేది. మాకు పైనుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు.. నీవు అక్రమ నిర్మాణాలు చేస్కో.. అధికారులు అసలు మాట్లాడరు.. వారికిచ్చేది ఇస్తాం.. ఎవరైనా అడిగితే మేం చూసుకుంటాం..’ ఇది పలమనేరు మున్సిపాలిటీలో సాగుతున్న అక్రమ నిర్మాణాల జోరు. ఎక్కడ ఆక్రమణలు జరిగినా మున్సిపల్ అధికారులకు చెప్పి వారి అండతోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. దీన్ని చూసిన జనం వీళ్లేమి నాయకులు సామీ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
విలువైన ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు
పట్టణంలోని మదనపల్లి రోడ్డులో చదరపు అడుగు విలువ రూ.4 వేలుగా ఉంది. దీంతో ప్రభుత్వ స్థలాలపై పలువురి కన్ను పడింది. అంబేడ్కర్ విగ్రహానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ స్థలాన్ని గతంలో మాజీ మంత్రిగా ఉన్న అమరనాథ్‌రెడ్డి బీసీ భవన్ కోసం శంకుస్థాపక చేశారు. ఇప్పుడు కూటమి పాలనలో ఈ స్థలాన్ని ఓ వ్యక్తి ఇటీవలే ఆక్రమించుకొని దాంట్లో రేకుల షెడ్డు వేసుకున్నాడు. ఈ విషయం నేతలకు తెలిసే జరిగింది. అధికారులకు సైతం తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురైన ఈ స్థలం విలువ ఇప్పుడు రూ.50 లక్షలకు పైమాటే.
ఏమీ భయపడొద్దు?
పట్టణంలోని మదనపల్లి రోడ్డులో సత్య బిల్డింగ్‌కు ఎదురుగా బసవన్న గుడి వెనుక వైపున్న డ్రైన్‌పై ఓ వ్యక్తి ఇటీవలే రాత్రికి రాత్రే రేకుల షెడ్డును కట్టేశాడు. దీనివెనుక ఆ ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీ నేత హస్తంతోనే ఈ వ్యవహారం సాగినట్టు తెలుస్తోంది. మున్సిపల్ అధికారుల ద్వారా పర్మిషన్ కోసం ఆలయానికి చెందిన వారి ద్వారా ఆరు నెలల ఖాళీస్థలం లీజు అగ్రిమెంట్ రాయించుకొన్నట్టు తెలిసింది. దీన్ని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు చూపెట్టి ఎన్‌క్రోచ్‌మెంట్ ఫీజు చెల్లించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. దీనిపై పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మూడు రోజులు మూతబడిన ఈ అక్రమ దుకాణం తాజాగా తెరుచుకుంది. మున్సిపల్ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు తలొగ్గి దీన్ని పట్టించుకోలేదు. ఓ కీలక నేత తానున్నానంటూ ముందుండి మళ్లీ దీన్ని ప్రారంభించడం గమనార్హం.
దండపల్లి రోడ్డులో ఇదేతంతు
మున్సిపాలిటీ పరిధిలోని దండపల్లి రోడ్డులో ఓ కూటమి నేత ఇటీవలే తనకు పట్టా ఉందని ఓ రేకుల షెడ్డును నిర్మించాడు. గతంలో నాగమణి అనే తహసీల్దార్ విధుల్లో ఉన్నప్పుడు భాను అనే వ్యక్తి పట్టణంలో పలు నకిలీ ఇంటిపట్టాలను భారీగా డబ్బు వసూలు చేసి విక్రయించేశాడు. ఇలా పట్టాలు పొందిన వాళ్లు గత ఎన్నికల్లో కూటమి పార్టీలో చేరి వారుపొందిన పట్టాల్లో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మున్సిపల్ టీపీఎస్ ఇందిరను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిని వివరణ కోరగా పట్టణంలో ఆక్రమణ విషయాలు తన దృష్టికి రాలేదని చెప్పారు.

మేం చూసుకుంటాం.. నువ్వు నిర్మించుకో!