
కులంపల్లె, కామినాయనపల్లె వాసుల నిరసన
ఐరాల: మోడల్ స్కూల్ పేరుతో తమ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను పుత్రమద్దికి తరలించడం సమంజసం కాదని మండలంలోని కుల్లంపల్లె, కామినాయనపల్లె గ్రామస్తులు సోమ వారం పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు హెచ్‌ఎంకు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో సుమారు 25 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారన్నారు. మోడల్ స్కూల్ పేరుతో 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుత్రమద్ది పాఠశాలకు విలీనం చేస్తూ విద్యార్థులను తరలించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామంలో 1942 నుంచి ప్రాథమిక పాఠశాల కొనసాగుతోందని, తమ గ్రామాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ప్రస్తుతం పాఠశాలలో 96 శాతం మంది దళిత పిల్లలే ఉన్నారని చెప్పారు. పాఠశాల దూరమైతే దళిత విద్యార్థులకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని వాపోయారు. పుత్రమద్దికి వెళ్లే మార్గం గుండా మధ్యలో చెరువు కట్ట ఉందని, చెరువు నిండిన సమయంలో మొరవ ఉధృతంగా సాగుతుందని, ఆ సమయంలో ఆ మార్గం గుండా పాఠశాలకు వెళ్లడం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఎంసీ అనుమతి లేకుండా తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేశారని మండిపడ్డారు. ‘మోడల్ స్కూల్ మాకొద్దు.. మా ఊరు పాఠశాల మాకు ముద్దు’ అంటూ తల్లిదండ్రులు నినాదాలు చేశారు.