
తోతాపురి @ రూ.2
ఉమ్మడి జిల్లా సమాచారం
మామిడి విస్తీర్ణం: 56వేలహెక్టార్లు
దిగుబడి అంచనా: 6.45 లక్షల మెట్రిక్ టన్నులు
తోతాపురి సాగు విస్తీర్ణం: 39,895 ఎకరాలు
దిగుబడి అంచనా: 4.99 లక్షల మెట్రిక్ టన్నులు
పళ్ల గుజ్జు పరిశ్రమలు: 43
పనిచేస్తున్న ఫ్యాక్టరీలు: 31
ర్యాంపులు: 40
ఫ్యాక్టరీలకు చేరిన కాయలు: 1.3 లక్షల మెట్రిక్ టన్నులు
ఉమ్మడి జిల్లాలో మామిడి ధర మళ్లీ పతనమైంది. ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.2 పలుకుతోంది. ఫ్యాక్టరీలో రూ.5కు అమ్ముడుబోతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8 పూర్తిగా అంతమైంది. జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీల్లో రూ.6, ర్యాంపుల్లో రూ.3.5 తగ్గదని చెప్పింది. కానీ క్షేత్ర స్థాయిలో ఇవేవీ అమలుగాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
కాణిపాకం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 56 వేల హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. మొత్తంగా 6.45లక్షల మెట్రిక్ టన్నుల వరకు మామిడి దిగుబడి అయ్యింది. టేబుల్ రకాలు కోత చివరి దశకు చేరుకుంటే... తోతాపురి కోతలు ఇప్పుడిప్పుడే ఆరంభమయ్యాయి. ఈ రకం మామిడి 39,895 హెక్టార్లు ఉంటే.. 4.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 1.5 లక్షల టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు వారి గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి తోతాపురి కోతలు ప్రారంభమైతే.. చాలా ఫ్యాక్టరీలు తోతాపురి కొనలేమని చేతులెత్తేశాయి. అధికారులు పట్టుబట్టినా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
మద్దతు ధర మూన్నాళ్ల ముచ్చటే
కూటమి ప్రభుత్వం తోతాపురి రకం మామిడి కేజీ రూ.8గా మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ ప్రోత్సాహ నిధి కింద మరో రూ.4తో కలిపి మొత్తం రూ.12 ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి పండుగ చేసుకున్నారు. తీరా ఆ సంబరాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి.
ర్యాంపుల్లో కేజీ రూ.2
ఈ సారి మామిడి ధరలు, అవస్థలు చూసి ర్యాంపులు తెరుచుకోవడం కష్టతరంగా మారింది. ర్యాంపులు ఫ్యాక్టరీకి రోజూ ఒక లారీ కాయలు తరలించేలా అవకాశం కల్పించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 ర్యాంపులు ఏర్పడ్డాయి. ఈ ర్యాంపుల్లో చాలా వాటికి రిజిస్ట్రేషన్ కూడా లేవు. అనాధికారికంగా ర్యాంపులను నిర్వహిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండే ఫలాన్ని ర్యాంపు నిర్వాహకులు చులకనగా చూస్తున్నారు. వీరు ఆడిందే..ఆట పాడిందే పాటగా ధరలను ఫిక్స్ చేస్తున్నారు. తొలుత తోతాపురి కేజీ రూ.4 అంటూ రంగంలోకి దిగారు. తర్వాత రూ.3.50, రూ.3కు సిండికేట్ అయ్యారు. శనివారం నుంచి తోతాపురి కేజీ ధర రూ.2 పలుకుతోంది. చిత్తూరు, పులిచెర్ల, బంగారుపాళెం, దామలచెరువు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో రూ.2 లెక్కన కొనుగోలు చేస్తున్నారు.
ఫ్యాక్టరీలో రూ.5
ఫ్యాక్టరీల్లో తోతాపురి కేజీ రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నారు. అదే టోకన్ తీసుకున్న రైతు వద్ద తోతాపురి రూ.6కు కొనుగోలు చేస్తున్నాయి. పలు ఫ్యాక్టరీలు సిండికేట్ అయ్యి ధరలను రూ.6 నుంచి రూ.5కు తగ్గించేశాయి. 95శాతం ఫ్యాక్టరీలో ఇదే ధరలు మాత్రమే అమలవుతున్నాయి.
ఈ పర్యటనలు ఎందుకో?
జిల్లా అధికారులు ఫ్యాక్టరీల వద్దకు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రైతులు, ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. అయితే అధికారులు మరోవైపు తప్పులన్నీ రైతులపై నెట్టేస్తున్నారు. పక్వానికి రాని కాయలను కోసి తెచ్చేస్తున్నారని, ఆగస్టు వరకు కోత కోయవచ్చని, ర్యాంపులు, ఫ్యాక్టరీలు అడిగిన రేట్లకు ఇచ్చేస్తున్నారని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం చేరవేసి మామిడి రైతులను నట్టేటా ముంచేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
చిత్తూరు నగరంలోని మామిడి కాయల ఫ్యాక్టరీలో క్యూకట్టిన వాహనాలు
మళ్లీ పతనమైన మామిడి ధరలు
తోతాపురి ర్యాంపుల్లో కేజీ రూ.2
ఫ్యాక్టరీలో రూ.5కు కొనుగోలు
రూ.6 తగ్గకుండా చూస్తామన్న అధికార యంత్రాంగం
మరింత దిగజారే అవకాశం
మండిపడుతున్న రైతులు
ఏమైపోవాలి?
ఈసారి దిగుబడి బా గొచ్చింది. పది రూపాయలు వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఆ పంటను చూస్తే కన్నీళ్లు తప్ప కాసులు రావడం లేదు. ఫ్యాక్టరీలకు తోలుదామనుకుంటే టోకన్లు లేవు. నేరుగా తీసుకెళితే ఫ్యాక్టరీ వాళ్లు తీసుకోవడం లేదు. ర్యాంపుకు వెళితే కేజీ రూ.2కు అడుగుతున్నారు. ఇలాగైతే రైతులు ఏమైపోవాలి.
–హరినాథ్, పులిచెర్ల మండలం
మద్దతు ధరపై ఏమంటారు?
కూటమి ప్రభుత్వం తోతాపురి కేజీకి రూ. 12 కల్పించింది. ఈ ధరకే కొనాలని చిత్తూ రు ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్వాహకులకు, మ ధ్యవర్తులకు మీడియా ముందు వార్నింగ్‌లు ఇచ్చారు. ఫ్యాక్టరీలు కొనలేదంటే సీజ్ చేస్తామన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చిత్తూరు పర్యటనకు వచ్చి ఫ్యాక్టరీలు కేజీ రూ.8కి కొంటాయని ప్రగాల్భాలు పలికారు. కానీ వీరి మాటలు.. వార్నింగ్‌లు అన్నీ ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఇప్పుడు ర్యాంపుల్లో కిలో రూ.2కు, ఫ్యాక్టరీల్లో రూ.5కు కొనోగులు చేస్తున్నారు.
–విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు

తోతాపురి @ రూ.2

తోతాపురి @ రూ.2

తోతాపురి @ రూ.2