
సచివాలయ ఉద్యోగులపై వివక్ష తగదు
చిత్తూరు అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శుల బదిలీలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులతో వేలాది మందికి ఇబ్బందులు తప్పవని సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ జీవో వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో నెం–05ను సవరించాలని కోరుతూ సోమవారం చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యూనియన్ నాయకులు మహేష్, వినోద్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేసుకునే అవకాశం కల్పించకుండా, ప్రభుత్వం తమపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ప్రతాప్, వెంకటేష్, సతీష్, జానకిరామ్ పాల్గొన్నారు.