ప్రాణం తీసిన మురుగు నీటి గుంత
– మురికి గుంతలో పడి చిన్నారి మృతి
రొంపిచెర్ల: మురుగు నీటి గుంత ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. ఈఘటన రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని లక్ష్మీనారాయణ కాలనీలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన ఆసిఫ్, ఉస్మా కుమార్తె ఆజూమిర్హ(3) పిల్లలతో వీధిలో అడుకుంటున్నారు. వీరు ఆడుకుంటున్న రోడ్డు పక్కనే మురుగు నీటి గుంత ఉంది. ప్రమాదవశాత్తు ఆ గుంతలో చిన్నారి పడింది. పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్తులు హుటాహుటిన గుంత వద్దకు చేరుకున్నారు. అప్పటికే చిన్నారు ప్రాణాలు వదిలింది. గుంత ఆరు అడుగుల లోతు ఉండడంతో ఊపిరాడక మృతిచెందింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలాన్ని రొంపిచెర్ల పోలీసులు సందర్శించి వివరాలను సేకరించారు. ఇదిలావుండగా వారం క్రితమే ఈ గుంతను జేసీబీతో మరింత పెద్దది చేశారు. అయినా పూడ్చకపోవడంతో చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది.
ప్రాణం తీసిన మురుగు నీటి గుంత


