జిల్లాలో మామిడి రైతుల తంటాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో మామిడి రైతుల తంటాలు

Jun 13 2025 5:19 AM | Updated on Jun 13 2025 5:31 AM

● పండిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు ● అమ్ముడుపోని తోతాపురి ● టోకన్ల పేరుతో నిబంధనలు ● అరకొరగా ఇస్తున్న ఫ్యాక్టరీలు ● పత్తా లేని అధికారులు

కాణిపాకం: జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్పోన్సో 3,127, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగులో ఉంది. వీటిని కోత కోసి రైతులు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళ్యం ఇతరాత్ర మార్కెట్లకు తరలిస్తున్నారు. టేబుల్‌ రకం కాయల కోతలు చివరి దశకు చేరాయి. ప్రస్తుతం తోతాపురి కోతలు ఆరంభమయ్యాయి.

గందరగోళం

అధికారుల ఒత్తిడి మేరకు కొన్ని ఫ్యాక్టరీలు తోతాపురి కొనుగోలుకు టోకన్లు పంపిణీ చేస్తున్నాయి. అవి కూడా అరకొరగా ఇస్తున్నాయి. చాలా వరకు టోకన్లు కూటమి నేతల సిఫార్సులతో అమ్ముడుబోతున్నాయి. కొన్ని చోట్ల అసలు టోకన్లే ఇవ్వడం లేదు. టోకన్ల పంపిణీని వాయిదా వేస్తూ బోర్డులు పెట్టేస్తున్నాయి. గుడిపాల మండలంలోని ఫ్యాక్టరీల వద్ద రైతులు గురువారం బారులు తీరారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కొంతవరకు టోకన్లు ఇచ్చి నిలుపుదల చేశారు. చిత్తూరు నగరంలోని ఓ ఫ్యాక్టరీలో టమాట గుజ్జు తయారీని కొనసాగిస్తున్నారు. మరో ఫ్యాక్టరీ టోకన్ల జారీని వాయిదా వేస్తూ బోర్డు పెట్టేసింది. టోకన్ల పంపిణీలో సరైనా స్పష్టత లేక రైతులను ఫ్యాక్టరీలు తిప్పించుకుంటున్నాయి.

తోతాపురికి టోకన్లు

జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90శాతం దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్‌ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. టేబుల్‌ రకాలను మాత్రం రైతులు కోతకోసి మార్కెట్‌, ఫ్యాక్టరీలకు తరలించారు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో రైతులు రోడెక్కారు. స్పందించిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించింది. ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున్న ప్రోత్సాహక నిధి ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారుల పోరు పడకలేక కొన్ని ఫ్యాక్టరీలు కాయల కొనుగోలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. టోకన్ల సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఈ కారణంగా ఫ్యాక్టరీల వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాత్రి లోడేత్తేస్తున్నాయి

తమిళనాడులోని క్రిష్ణగిరి, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వచ్చే కాయలకు జిల్లాలోని ఫ్యాక్టరీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా తమిళనాడు కాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ తోతాపురి కిలో రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నాయి. అక్కడి వ్యాపారులు రూ.5కే ఫ్యాక్టరీకి డెలివరీ ఇస్తున్నారని జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు.

రూ.8 కాదు.. రూ.6కే!

తోతాపురి కిలో రూ.8కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇది అమల్లోకి రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతికష్టం మీద ఫ్యాక్టరీలు రూ.6కు కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. ఇదీ కూడా కొన్ని రోజుల ముచ్చటేనన్ని రైతులు దిగాలు చెందుతున్నారు.

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

టోకన్లు ఎప్పుడు ఇచ్చారో తెలియడం లేదు. నాలుగు రోజులుగా ఫ్యాక్టరీల చుట్టూ తిరుతున్నా. గురువారం టోకన్ల కోసం ఫ్యాక్టరీ కాడికి వస్తే.. టోకన్లు ఇప్పుడు ఇచ్చేది లేదంటున్నారు. సోమవారం రమ్మని బోర్డు పెట్టేశారు. నేను 3.5 ఎకరాల్లో మామిడి సాగు చేశా. కాయలు రాలిపోతున్నాయి.

– దశరథన్‌, మాపాక్షి, చిత్తూరు

దొంగతనంగా తీసుకొచ్చేస్తున్నారు

చిత్తూరు కాయలను వద్దని..దొంగతనంగా బయట కాయలను తీసుకొచ్చేస్తున్నారు. క్రిష్ణగిరి కాయలు దించుకుంటున్నారు. రాత్రికి...రాత్రి..ఆ కాయలను తీసుకొస్తుంటే అడ్డుకునే వారులేరు. అందుకే జిల్లా కాయలను వద్దంటున్నారు. ఈ టోకన్ల సిస్టం తీసేసి...కాయలు కొనుగోలు చేసేలా చూడాలి.

– నాగరాజు, ఎల్‌బీపురం, చిత్తూరు

పర్మిట్ల కోసం పడిగాపులు

గుడిపాల: పర్మిట్ల కోసం మామిడి రైతులు తెల్లవారు జాము నుంచే పడిగాపులు కాశారు. గురువారం గుడిపాల మండలంలోని ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌, తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీల వద్ద గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. ఎవ్వరూ స్పందించకపోవడంతో ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. గుడిపాల తహసీల్దార్‌ జయంతి, ఎస్‌ఐ రామ్మోహన్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపారు.

200 మందికి టోకెన్లు

200 మందికి టోకన్లు అందజేశారు. దీంతో వివాదం సర్దుమణిగింది. 17వ తేదీ వరకు టోకన్లు ఇవ్వడం కుదరదని ఫ్యాక్టరీ నిర్వాహకులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా తమిళనాడు నుంచి వస్తున్న మామిడి కాయలకే అధికంగా ఫ్యాక్టరీ వారు ప్రాధాన్యత చూపుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. లారీల ద్వారా లోడ్లు వచ్చిన వెంటనే టోకన్లు లేకుండానే అన్‌లోడ్‌ చేస్తున్నారని తెలిపారు.

జిల్లా సమాచారం

మామిడి రకం హెక్టార్లు దిగుబడి అంచనా

తోతాపురి 39,895 49,9274

నీలం 5,818 64,991

అల్పోన్సో 3,127 26,404

బేనీషా 3,895 28,867

మల్లిక 1,740 13,919

ఇతర రకాలు 1,526 11,779

జిల్లాలో మామిడి రైతులు నానాతంటాలు పడుతున్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి నరకం అనుభవిస్తున్నారు. తోతాపురి అమ్ముడుపోక విలవిల్లాడుతున్నారు. టోకన్ల పేరుతో ఫ్యాక్టరీ యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. దీనికితోడు తోతాపురి కిలో రూ.6కే కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.8కే కొనుగోలు చేయాలని నిర్ణయించినా అవేవీ పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఇటు ఫ్యాక్టరీ యజమానులను ఒప్పించలేక.. రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో మామిడి ధరలు

రకం ధర(కిలో)

చందూర రూ.4

బేనీషా రూ.10–రూ.20

మల్లిక రూ.7–రూ.20

కాలేపాడు రూ.20– రూ.30

ఇమామ్‌ పసంద్‌ రూ.40–రూ.70

తోతాపురి (టేబుల్‌ రకం) రూ.10–రూ.13

అల్పోన్సో రూ.20– రూ.30

ముఖం చాటేస్తున్న ఫ్యాక్టరీలు

జిల్లాలో సాగయ్యే మామిడి ఫలాల్లో టేబుల్‌ రకాలు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. తోతాపురి కాయలు గుజ్జు తయారీకి తరలుతుంటాయి. ఈ కాయలన్నీ కూడా జిల్లాలోని 47 గుజ్జు పరిశ్రమలకు చేరుతుంటాయి. గతేడాది తయారీ చేసిన గుజ్జు నిల్వలు అలాగే ఉండడంతో ఈ సారి మామిడి కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా ఫ్యాక్టరీ యజమానులు ముఖం చాటేస్తున్నారు.

జిల్లాలో మామిడి రైతుల తంటాలు 
1
1/3

జిల్లాలో మామిడి రైతుల తంటాలు

జిల్లాలో మామిడి రైతుల తంటాలు 
2
2/3

జిల్లాలో మామిడి రైతుల తంటాలు

జిల్లాలో మామిడి రైతుల తంటాలు 
3
3/3

జిల్లాలో మామిడి రైతుల తంటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement