పర్మిట్లకు అగచాట్లు
గుడిపాల : పర్మిట్ల కోసం రైతన్నలు పడిగాపులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా రైతులకు మాత్రం పర్మిట్లు అందడం లేదు. గుడిపాల మండలంలోని తాసా, పుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీలలో రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. మంగళవారం ఏకంగా కలెక్టర్ తనిఖీలు నిర్వహించగా రైతుల పర్మిట్‌లను కొంతసేపు ఇచ్చి ఆపేశారు. ఆ తరువాత ఇవ్వడానికి కుదరదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన పర్మిట్లకు మాత్రమే తీసుకొని తరువాత పర్మిట్లు మంజూరు చేస్తామని చెప్పారు.
తమిళనాడు ప్రాంతం వారికి ప్రాధాన్యం
తమిళనాడు నుంచి వస్తున్న మామిడి కాయలకు ఫ్యాక్టరీ యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడి నుంచి తక్కువ రేటుకు మామిడి దిగుబడి చేసుకోవడంతో ఇక్కడ రైతులను పట్టించుకోవడం లేదు. ఇక్కడ కొనుగోలు చేస్తే రైతుల వద్ద నుంచి రూ.8 కి కొనుగోలు చేయాలి. తమిళనాడు నుంచి వచ్చినట్లయితే రూ. 6కే తమకు వస్తుందని ఫ్యాక్టరీ వారు చెబుతున్నారు.
– రైతుల వద్ద నుంచి మామిడి కాయలను కొనుగోలు చేస్తామని ఉద్యానవనశాఖ ఏడీ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం గుడిపాలలోని పుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. యాజమాన్యంతో చర్చించి అధికంగా పర్మిట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైతులు ఆందోళన చెందొద్దని ఆయన హామీ ఇచ్చారు.


