
సర్వర్ పరేషన్
● పది రోజులుగా పనిచేయని సర్వర్ ● రేషన్‌కార్డు దరఖాస్తుకు బ్రేకులు ● లక్షల్లో దరఖాస్తులు..అరకొరగా నమోదు ● విమర్శలతో కదిలిన ప్రభుత్వం ● దరఖాస్తుకు మళ్లీ అవకాశం
పనిచేయని సర్వర్
రేషన్‌కార్డు దరఖాస్తుకు వేచి ఉన్న లబ్ధిదారులు (ఫైల్)
కాణిపాకం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలను ఊరిస్తూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దరఖాస్తు ప్రక్రియలో ఎదురువుతున్న ఇబ్బందులు చుక్కలు చూపుతున్నాయి. రేషన్ కార్డు దరఖాస్తు గడువు ఈనెల 9వ తేదీతో ముగిసింది. అయితే గడువును పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ నేటికీ సాఫ్ట్‌వేర్‌లో నిబంధనలు మార్చకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. సాఫ్ట్‌వేర్‌లో నిబంధనలు సరళతరం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.అతికష్టం మీదుగా దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. ఇచ్చిన కొద్ది రోజులకే సర్వర్ డౌన్‌తో అగచాట్లు తప్పలేదు. మళ్లీ రేషన్‌కార్డు దరఖాస్తుకు ప్రభుత్వం గడువు పొడిగించినా క్షేత్రస్థాయిలో సర్వర్ పనిచేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడంలేదు. గత నెల వరకు రేషన్ కార్డుల వివిధ సమస్యల నిమిత్తం మొత్తం 39791 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్ కార్డులో చిరునామా మార్పునకు 841, ఆధార్ అనుసంధానం సరి చేసుకునేందుకు 532, షాపు రెన్యూవల్ 14, సభ్యుల చేర్పునకు 30464, సభ్యుల తొలగింపు 672, కొత్త రేషన్ కార్డుకు 3926, స్ప్లిట్ కార్డు దరఖాస్తుకు 3301, సరెండర్ రేషన్‌కార్డు 41 దాకా వచ్చాయి. అయితే దరఖాస్తు ప్రక్రియలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సాఫ్ట్‌వేర్‌లో మార్చాల్సిన అవసరం ఉందని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలు ఇవీ..
● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు ఉన్నప్పుడు కొడుకుకు పెళ్లయి కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే మొదట భార్య పేరును ఈ కార్డులోకి మార్పించుకోవాలి. తరువాత 21 రోజులకు కొడుకు, కోడలకు ప్రత్యేకంగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరికి పిల్లలు పుడితే ఆ పిల్లలను వీరి కార్డులోకి ఎక్కించుకోవాలంటే మరో 21 రోజులు గడువు ఉంటుంది. ఈ విధంగా ఒక పేరు కార్డులో నమోదు కావాలంటే రోజుల తరబడి గడువు ఉంటే ఈ లోగా దరఖాస్తు గడువు ముగుస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఉంటే కూతురుకు పెళ్లయి వారికి వేరే కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నప్పుడు ఈ కార్డులో కార్డుదారుని కూతురు స్థానంలో కోడలు అని నమోదు అయినా, కోడలు స్థానంలో కూతురు అని నమోదైనా.. కార్డుదారుడికి సంబంధించి బంధుత్వంలో తేడాలు ఉంటే వారి పేరు తొలగించడానికి కుదరటం లేదు.
● ఒక కార్డులో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు ఉన్నప్పుడు ఉదాహరణకు రేషన్‌కార్డులో కార్డుదారుని కోడలుకు సంబంధించి కోడలు అని కాకుండా ఎన్‌ఏ అని ఉంటే కోడలు పేరు కార్డులో నుంచి తొలగించలేకపోతున్నారు.
● భార్యాభర్తకు కొత్త రేషన్‌కార్డు కావాలన్నప్పుడు వారి ఆధార్ కార్డులో స్థానికంగా కాకుండా వేరే అడ్రసు ఉంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంతేకాక ఇంటి మ్యాపింగ్ జరగడం లేదని లబ్ధిదారులు వాపో తున్నారు. ఆధార్ కార్డులో చిరునామాలు సక్రమంగా ఉంటేనే ఇంటి మ్యాపింగ్ అవుతుందని, ఇంటి మ్యాపింగ్ అయితేనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. ఆధార్‌లో చిరునామాల తేడా కారణంగా పాత కార్డు నుంచి వీరి పేర్లు తొలగించినా ఇంటి మ్యాపింగ్ కావడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
● రేషన్‌కార్డు దరఖాస్తులో కరెంటు బిల్లు అధికంగా వచ్చినా కొత్త కార్డుకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ కరెంటు బిల్లులు తప్పులు వచ్చి విద్యుత్ శాఖ అధికారుల ద్వారా తప్పులు సరిచే సుకున్నా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే దాదాపు నెలరోజుల సమయం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● రేషన్ కార్డు ఎవరిపేరు మీద ఉంటుందో ఆ కార్డుదారుడు మళ్లీ కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు.
వీఆర్‌ఓల అందుబాటులో లేకపోవడం
రేషన్ కార్డులు మంజూరులో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చాలా మండలాల్లో రెండు నుంచి నాలుగు గ్రామాలకు ఒక రెవెన్యూ అధికారి ఉండటంతో అతని కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారి దరఖాస్తుపై సంతకం చేస్తేనే డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.
సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయకపోవడం
సాఫ్ట్‌వేర్‌ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి ఎటువంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాక కొత్త రేషన్‌కార్డుల నమో దుపై గ్రామ సచివాలయ అధికారులకు అవగాహన కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో చాలామంది దరఖాస్తు నమోదులో సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇతర అధికారులపై ఆధార పడాల్సి వస్తోంది.
రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు..
సైట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అందుకే సర్వర్ డౌన్ అయింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు అనేది లేదు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆందోళన వద్దు
– శంకరన్, డీఎస్‌ఓ, చిత్తూరు

సర్వర్ పరేషన్

సర్వర్ పరేషన్