రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
కుప్పం : కుప్పం రైల్వేస్టేషన్ వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం దిబ్రూనగర్ నుంచి బెంగళూరు వెళ్తున్న రైల్లో ప్రయాణిస్తుండగా కుప్పం రైల్వేస్టేషన్ రాగానే ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. రైల్వే పోలీసులు గాయపడిన వ్యక్తిని కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. బ్లూకలర్ టీ షర్ట్ దరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
కర్ణాటకలో కుప్పం మహిళా దొంగల అరెస్టు
రూ.6 లక్షల నగలు స్వాధీనం
దొడ్డబళ్లాపురం : రద్దీగా ఉన్న బస్సులు, బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నలుగురు మహిళా దొంగలు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నివాసులైన శశి (35), మాధవి (40), అఖిల (30), విద్య (29) అనేవారిని కర్ణాటకలోని హాసన్ జిల్లా హొళేనరసీపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.38 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. హొళెనరసీపుర బస్టాండులో ఒక మహిళ బంగారు గొలుసు చోరీకి గురైంది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నలుగురు మహిళలు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగలని తేలడంతో అరెస్ట్ చేశారు. వీరి మీద బెంగళూరులోని పలు పోలీస్‌స్టేషన్లలో చోరీ కేసులు నమోదై ఉన్నాయి. నలుగురూ ముఠాగా ఏర్పడి ఊరూరూ తిరుగుతూ చోరీలు చేసి మళ్లీ కుప్పంకు వెళ్లిపోయేవారని పోలీసులు తెలిపారు.


